English | Telugu

షారుక్ చిత్రానికి రెహ‌మాన్ బాణీలు - అనిరుథ్ నేప‌థ్య సంగీతం!

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ద‌క్షిణాది ద‌ర్శ‌కుడు అట్లీ కాంబినేష‌న్ లో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. షారుక్ ద్విపాత్రాభిన‌యం చేస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార‌, ప్రియ‌మ‌ణి నాయిక‌లుగా న‌టిస్తుండ‌గా సాన్యా మ‌ల్హోత్రా, యోగిబాబు, సునీల్ గ్రోవ‌ర్ ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు. కోలీవుడ్ స్టార్ విజ‌య్ అతిథి పాత్ర‌లోనూ.. రానా ద‌గ్గుబాటి కీల‌క పాత్ర‌లోనూ క‌నిపించ‌నున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది.

ఇదిలా ఉంటే.. ఈ భారీ బ‌డ్జెట్ మూవీకి ఇద్ద‌రు సంగీత ద‌ర్శ‌కులు ప‌నిచేయ‌నున్న‌ట్లు స‌మాచారం. స్వ‌ర‌మాంత్రికుడు ఎ.ఆర్. రెహ‌మాన్ బాణీలు అందించ‌నుండ‌గా.. కోలీవుడ్ యంగ్ మ్యూజిక్ సెన్సేష‌న్ అనిరుధ్ నేప‌థ్య సంగీత‌మందించ‌బోతున్న‌ట్లు టాక్. మ‌రి.. ఈ ప్ర‌చారంలో వాస్త‌వ‌మెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.

కాగా, అట్లీ గ‌త రెండు చిత్రాలు `మెర్స‌ల్`, `బిగిల్`కి ఎ.ఆర్. రెహ‌మాన్ స్వ‌రాలు స‌మ‌కూర్చ‌గా.. అనిరుధ్ కి మాత్రం అట్లీ కాంబినేష‌న్ లో ఇదే మొద‌టి సినిమా. ఇక షారుక్ - రెహ‌మాన్ కాంబినేష‌న్ లో ఇప్ప‌టికే `దిల్ సే`, `వ‌న్ 2 కా 4`, `స్వ‌దేశ్`, `జ‌బ్ త‌క్ హై జాన్` చిత్రాలు వ‌చ్చాయి. అనిరుధ్ కి మాత్రం షారుక్ తోనూ ఇదే తొలి చిత్రం కానుంది.