Read more!

English | Telugu

బాలీవుడ్‌లో క‌ల‌క‌లం.. అక్ష‌య్ ‌కుమార్ సినిమా టీమ్‌లో 45 మందికి క‌రోనా!

 

అక్షయ్ కుమార్‌కు క‌రోనా పాజిటివ్ అని నిర్ధార‌ణ అయిన ఒక రోజు తరువాత , 'రామ్ సేతు' సెట్స్‌లోని 45 మంది సిబ్బంది కూడా కొవిడ్ 19 పాజిటివ్‌గా నిర్ధార‌ణ అవ‌డం సంచ‌ల‌నం సృష్టించింది. ఈ చిత్రం షూటింగ్ సోమవారం నుండి ముంబైలోని కొత్త లొకేష‌న్‌లో ప్రారంభం కానుండటంతో త‌ప్ప‌నిస‌రిగా టెస్ట్‌లు చేశారు. ముందుజాగ్రత్త చర్యగా 100 మందికి పైగా పరీక్షించగా, 45 మందికి క‌రోనా పాజిటివ్ అని తేలింది. దీంతో రామ్‌సేతు షూట్ ఆగిపోయింది.

ఈ మ‌ధ్య‌లో అక్ష‌య్ కుమార్ హాస్పిట‌ల్‌ పాలయ్యాడు. "శుభాకాంక్ష‌లు తెలిపిన‌, ప్రార్థ‌న‌లు చేసిన అంద‌రికీ ధన్యవాదాలు. నేను బాగానే ఉన్నాను, కాని వైద్య సలహా ప్రకారం ముందు జాగ్రత్త చర్యగా, నేను హాస్పిట‌ల్‌లో చేరాను. త్వరలో ఇంటికి తిరిగి వస్తానని ఆశిస్తున్నాను. జాగ్రత్తగా ఉండండి.” అని ఆయ‌న‌ ట్విట్టర్‌లో రాశాడు.

ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (ఎఫ్‌వైసిఇ) అధ్యక్షుడు బిఎన్ తివారీ 'రామ్ ‌సేతు' టీమ్‌కు కొవిడ్ సోకింద‌నే వార్త‌ను ధృవీకరించారు . "చాలా మంది జ‌నం ఒకేసారి పాజిటివ్‌గా నిర్ధార‌ణ అవ‌డం చాలా దురదృష్టకరం. వారిలో చాలామంది జూనియర్ కళాకారులు కాగా, అక్షయ్ కుమార్ బృందానికి చెందిన కొందరు COVID-19 పాజిటివ్‌గా తేలారు. వీరంతా క్వారంటైన్‌లో ఉంటూ వైద్య సహాయం పొందుతున్నారు. అక్షయ్ కూడా క్వారంటైన్‌లో ఉన్నందున, ప్రస్తుతానికి ఆ సినిమా షూట్‌ను నిలిపివేశారు.” అని ఆయ‌న చెప్పారు.

అభిషేక్ శర్మ దర్శకత్వం వహిస్తున్న‌ 'రామ్ సేతు' మూవీలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నుష్రత్ భరూచా కూడా హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్, అబుండాంటియా ఎంటర్టైన్మెంట్, లైకా ఫిల్మ్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో క‌లిసి నిర్మిస్తున్నాయి. అయోధ్యలో ముహూరత్ షూట్ తరువాత, మార్చి 30 నుండి ముంబైలో రామ్ సేతు చిత్రీకరణ ప్రారంభించారు.