English | Telugu

నిర్మాతను చెప్పుతో కొట్టిన నటి.. అది కూడా పబ్లిక్‌లో!

ఇటీవలి కాలంలో ఫిలిం ఇండస్ట్రీలో కాంట్రవర్సీలు చాలా ఎక్కువైపోయాయి. వివాదాలు అనేవి ఎప్పుడూ ఉంటాయి. అయితే గతంలో ఇవి బయటికి ఎక్కువగా వచ్చేవి కావు. దానికి కారణం ఆరోజుల్లో మీడియా అంత విస్తృతంగా లేకపోవడం వల్ల ఇండస్ట్రీలో ఏ సమస్య వచ్చిన వారే పరిష్కరించుకునేవారు. కానీ, ఇప్పుడలా కాదు, ఎక్కడ ఏం జరిగినా నిమిషాల్లో సోషల్‌ మీడియాలోకి వచ్చేస్తోంది. తాజాగా బాలీవుడ్‌లో జరిగిన వివాదం కారణంగా నిర్మాతను ఓ నటి పబ్లిక్‌లో చెప్పుతో కొట్టే వరకు వెళ్లింది. సోషల్‌ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది. మొదట ఆ నటి నిర్మాతను ఎందుకు కొట్టింది అనే విషయం ఎవరికీ తెలీదు. అయితే దానికి సంబంధించిన వివరాలు కూడా అందుబాటులోకి రావడంతో ఈ వార్త వైరల్‌ అయిపోయింది.

హిందీ సీరియల్స్‌లో నటించే రుచి గజ్జర్‌ అనే నటి, నిర్మాత కరణ్‌సింగ్‌ చౌహాన్‌ మధ్య వివాదమిది. కరణ్‌సింగ్‌ చౌహాన్‌ తాజాగా నిర్మించిన ‘సొలాంగ్‌ వ్యాలీ’ చిత్రం శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమా స్క్రీనింగ్‌కి వచ్చిన రుచి గజ్జర్‌ అతనిపై చెప్పుతో దాడి చేసింది. వివరాల్లోకి వెళితే.. ఒక సీరియల్‌కి సంబంధించి రుచిని సంప్రదించాడు కరణ్‌ సింగ్‌. ఆ సీరియల్‌కి కో ప్రొడ్యూసర్‌గా చేరమని కోరాడు. ఆ సీరియల్‌ నిర్మాణం కోసం 24 లక్షల రూపాయలను పలు బ్యాంకుల్లోని అతని ఎకౌంట్స్‌లో డిపాజిట్‌ చేసింది రుచి. ఇది జరిగి రెండు సంవత్సరాలవుతున్నా ఇంతవరకు సీరియల్‌ ప్రారంభించలేదు. దాంతో తన డబ్బు రిటర్న్‌ చేయమని కరణ్‌సింగ్‌ను కోరింది రుచి. అయితే ఆ డబ్బు ఇవ్వకుండా ఏదో ఒక సమాధానం చెబుతున్నాడు. అలా అడిగినందుకు తనను బెదిరిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది రుచి.

సీరియల్‌ నిర్మాణం కోసం తీసుకున్న డబ్బును ‘సొలాంగ్‌ వ్యాలీ’ చిత్రాన్ని నిర్మించేందుకు వాడుకున్నాడన్నది రుచి ఆరోపణ. ఇప్పటికే దీనికి సంబంధించి ఫిర్యాదు చేసింది. ముంబై పోలీసులు కరణ్‌సింగ్‌ చౌహాన్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కరణ్‌సింగ్‌తో గొడవ పడేందుకే ‘సొలాంగ్‌ వ్యాలీ’ స్క్రీనింగ్‌కి వచ్చింది రుచి. అందరి ముందు అతన్ని చెప్పుతో కొట్టి తన దగ్గర ఉన్న పోలీస్‌ ఎఫ్‌ఐఆర్‌ కాపీని అందరికీ చూపిస్తూ కరణ్‌ని తిట్టడం మొదలు పెట్టింది. కూల్‌గా ఉండమని అందరూ చెప్తున్నా ఆమె వినలేదు. ‘నేను కష్టపడి సంపాదించుకున్న డబ్బు అది.. కూల్‌గా ఎలా ఉండమంటారు?’ అంటూ ప్రశ్నించింది. రుచి, కరణ్‌సింగ్‌ మధ్య ఉన్న ఆర్థిక లావాదేవీల గురించి, థియేటర్‌ దగ్గర జరిగిన ఘటన గురించి ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.