English | Telugu

బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్న సైయారా..!

ఒకప్పుడు ఇండియాలో టాప్ ఇండస్ట్రీ అంటే బాలీవుడ్ పేరు వినిపించేది. అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాలు ఎక్కువగా హిందీ నుంచే వచ్చేవి. అలాంటిది కొంతకాలంగా బాలీవుడ్ పరిస్థితి బాలేదు. స్టార్ హీరోల సినిమాలే బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేయలేకపోతున్నాయి. ఇలాంటి సమయంలో నూతన నటీనటులు నటించిన సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. అదే 'సైయారా'. రెండు వారాలు కూడా పూర్తి కాకుండానే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. (Saiyaara)

'మర్డర్ 2', 'ఆషికీ 2', 'ఏక్ విలన్', 'మలంగ్' వంటి సినిమాలతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న మోహిత్ సూరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సైయారా'. యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన ఈ రొమాంటిక్ డ్రామాతో ఆహాన్ పాండే, అనీత్ పడ్డా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. పెద్దగా అంచనాలు లేకుండా జూలై 18న థియేటర్లలో అడుగుపెట్టిన 'సైయారా' మూవీ.. కేవలం 11 రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా రూ.400 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇప్పటిదాకా ఇండియాలో రూ.318 కోట్లు, ఓవర్సీస్ లో రూ.86 కోట్లతో.. ప్రపంచవ్యాప్తంగా రూ.404 గ్రాస్ సాధించిందని ట్రేడ్ వర్గాల అంచనా. ఇదే జోరు కొనసాగితే త్వరలో రూ.500 కోట్ల క్లబ్ లో చేరినా ఆశ్చర్యంలేదు.

జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలుగా యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ 'వార్-2' ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ భారీ సినిమాకి ముందు 'సైయారా' రూపంలో యశ్ రాజ్ ఫిలిమ్స్ కి బిగ్ హిట్ వచ్చిందని చెప్పవచ్చు.