Read more!

English | Telugu

ఈ సారి ఆ ఛాన్స్ అభిషేక్‌ - విక్కీ కౌశల్‌ సొంతం


బాలీవుడ్‌ స్టార్స్ అభిషేక్‌ బచ్చన్‌, విక్కీ కౌశల్‌ కలిసి ఈ సారి ఐఫాకు వ్యాఖ్యాతలుగా వ్యవహరించనున్నారు. ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిల్మ్ అకాడమీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. అబుదాబీలోని యస్‌ ఐలాండ్స్ లో ఈ వేడుకలు జరుగనున్నాయి. మే 26, 27న ఈ వేడుకలకు ముహూర్తం పెట్టారు. ఐఫాకు సంబంధించిన బచ్చన్‌ మాట్లాడుతూ ''ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిల్మ్ అకాడమీ అవార్డులకు హోస్ట్ చేయడానికి అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఐఫా నా కుటుంబంతో సమానం. అందుకే నాకెప్పుడూ కొత్తగా అనిపించదు. ఐఫాకు సంబంధించి ప్రతిదీ బాధ్యతగానే అనిపిస్తుంది. గ్లోబల్‌ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న ఫంక్షన్‌ అది. అక్కడికి వచ్చే వేలాది మంది ప్రేక్షకులను వేదిక మీద నిలుచుని ఎంటర్‌టైన్‌ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఐఫా అవార్డులకు వ్యాఖ్యాతగా వ్యవహరించడం సో హ్యాపీ'' అని అన్నారు. 

విక్కీ కౌశల్‌ మాట్లాడుతూ ''నాకిప్పుడు 34 ఏళ్లు. జూనియర్‌ బచ్చన్‌కన్నా 13 ఏళ్లు చిన్నవాడిని. ఆయనతో కలిసి స్టేజ్‌ షేర్‌ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అత్యంత గౌరవప్రదంగా అనిపిస్తోంది. దాదాపు ఏడేళ్ల క్రితం ఈ వేడుకకు వెళ్లాను. నా తొలి సినిమా మసాన్‌కి బెస్ట్ డెబ్యూ అవార్డు తీసుకోవడం కోసం వెళ్లా. ఆ తర్వాత సంజులో ఉత్తమ సపోర్టింగ్‌ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందాను. గతేడాది సర్దార్‌ ఉద్దమ్‌గా గౌరవ పురస్కారాన్ని అందుకున్నాను. ఒకటికి మూడు సార్లు అవార్డులు అందుకున్న వేదిక మీద ఇలా వ్యాఖ్యాతగా నిలుచోవడం కొత్త భావన'' అని చెప్పారు.

అబుదాబీ కల్చర్‌ అండ్‌ టూరిజమ్‌ డిపార్ట్ మెంట్‌తో కలిసి ఈ అవార్డుల వేడుకను నిర్వహించనున్నారు. ప్రతి ఏటా ప్రముఖ నటీనటులు ఈ వేదిక మీద పెర్ఫార్మ్ చేస్తారు. ఈ ఏడాది కూడా సల్మాన్‌ ఖాన్‌, వరుణ్‌ ధావన్‌, కృతిసనన్‌ పెర్ఫార్మ్ చేయడానికి ఆల్రెడీ అంగీకరించారు. భారీగా జరిగే ఈ వేడుక కోసం సెలబ్రిటీ లోకం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తోంది.