Facebook Twitter
కుక్కకాటుకు చెప్పుదెబ్బ

కుక్కకాటుకు చెప్పుదెబ్బ

 

   సేకరణ- డా.ఎ. రవీంద్రబాబు

           ఒక అడవిలో ఉండే నక్కకు, కొంగకు మంచి స్నేహం కుదిరింది. చాలా కాలంగా హాయిగా కలసిమెలసి సంతోషంగా ఉంటున్నాయి. ఒకరోజు ఇద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు మాటల మధ్య కొంగ 'నక్కబావ నక్కబావా...! ఎప్పుడూ ఏటిలో చేపలు తినితిని విసుగొస్తుంది. నాకు ఎప్పటి నుంచో ఓ కోరికుంది.' అని చెప్పంది నక్కతో. 'ఏం కోరిక...? ఏమన్నా కొత్త వంటలేమన్నా తినాలని ఉందా?' అని అడిగింది నక్క. 'అవును నక్కబావా...! నాకు పాయసం అంటే చాలా ఇష్టం. తినాలని అనిపిస్తుంది. నాకేమో చేయడం కూడా రాదు' అన్నది. అందుకు నక్క 'ఓ... పాయసమా... అదేంత పని. నాకు చేయడం వచ్చు. రేపు ఆదివారం మా ఇంటికి వచ్చేయి. నీకు పాయసం చేసి పెడతాను' అన్నది. అందుకు కొంగ చాలా సంతోషించింది. ఇన్నాళ్లకు తన నాలుకకు పాయసం రుచి తగలబోతుందన్న ఆనందంతో...
       ఆదివారం రాగానే త్వరత్వరగా తయారై, నక్క ఇంటికి వెళ్లింది. నక్క కొంగ రాగానే... 'రా కొంగబావా రా... నీవు నా ఇంటికి రావడం నా అదృష్టం. పాయసం ఉండుకుతోంది. రెండు నిముషాలు కూర్చో' అంది. వంటగదిలోంచి పాయసం వాసన గుభాళిస్తుంది. ఆ వాసనకే కొంగకు నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. ఎప్పుడెప్పడు తెస్తుందా...! ఎప్పుడెప్పుడు తిందామా...! అని మనసులో అనుకుంటుంది. అనుకున్నట్లుగానే నక్క పాయసాన్ని రెండు వెడల్పాటి ప్లేటుల్లో పోసి తీసుకొచ్చింది. ఒకటి కొంగ ముందు పెట్టింది. తనూ ఒకటి తీసుకొంది. యాలుకలు, కొబ్బరి... లాంటివి వేసి చేసినట్లుంది. వాసన అద్భుతంగా ఉంది.
      కొంగ ఉండబట్టలేక పాయసం ప్లేటులో తన పొడువాటి నోరుబెట్టి తినబోయింది. కాని కొద్దిగా కూడా దాని నోటిలోకి రాలేదు. తన పొడువాటి మూతికి అసలు దొరకడం లేదు. అటు ఇటు కదలడం తప్ప. పాపం కొంగకు తినాలని మనసు ఎంత ఉవ్విళ్లూరుతున్నా ఏమి తినలేక బిక్కమొహం వేసుకొని నక్కను చూస్తుంది. నక్కమాత్రం... 'తిను కొంగబావా' అంటూ... తన నాలుకతో తన ముందున్న ప్లేటులోని పాయసం మొత్తాన్ని నాకినాకి తినింది. తినడమే కాకుండా... 'ఏంటి కొంగబావా నీవు అసలు తినలేదు...?' అని కొంగ ముందున్న ప్లేటులోని పాయసాన్ని కూడా అదే లాగించేసింది. కొంగకు చాలా బాధ కలిగింది. ఏమీ చేయాలో అర్థం కాలేదు. మంచి స్నేహితుడని అనుకుంటే- ఇంటికి పిలిచి, తనకిష్టమైన వంటకం చేసి మరీ అవమానించిది. అందుకే ఆలోచించింది.
      వెళ్తూ వెళ్తూ... 'నక్కబావా నక్కబావా...! నీ అతిథి మర్యాదకు కృజ్ఞతలు. నీవు కూడా మా ఇంటికి తప్పక భోజనానికి రావాలి. నీకిష్టమైన చేపలకూర వండి పెడతాను.' అంది. చేపలకూర అనగానే నక్కమదిలో ఆశ ఎక్కువైంది. 'తప్పకుండా వస్తాను. రేపే వస్తాను. మంచిమంచి చేపలు పట్టి, పులుపెట్టు నాకు బాగా ఇష్టం.' అని చెప్పంది. కొంగ 'అలాగే...' అని చెప్పి, వెళ్లిపోయింది.
     కొంగ ఏటికి వెళ్లి మంచిమంచి చేపల్ని పట్టితెచ్చింది. చింతపండు వేసి బాగా పులుసు చేసింది. అనుకున్న సమయం కంటే నక్క అర్థగంట ముందే వచ్చింది. నక్కరాగానే కొంగ... 'రా నక్కబావా రా...' అని మంచి మర్యాద చేసింది. చేపల పులుసు లోపల ఉడుకుతుంటే ఎప్పుడెప్పుడు తిందామా అని నక్కకు ఆశగా ఉంది.

      కొంగ చిన్నచిన్న చేప ముక్కలతో ఉన్న పులుసును రెండు పొడుగు కూజాలలో పోసి తెచ్చింది. ఒకటి నక్కముందు పెట్టి, తనూ ఒకటి ముందు పెట్టుకుంది. నక్క చేప ముక్కల తిందామని లోపలికి తల పెట్టగానే తల లోపలికి పోవడం లేదు. ఆ కూజా పైభాగం చాలా సన్నగా ఉంది. ఎంత ప్రయత్నించినా కుదరడం లేదు. ఎదురుగా కొంగ మాత్రం తన పొడవాటి మూతిని కూడా లోపలికి దూర్చి ఒక్కో ముక్కను తింటుంది. 'ఏంటి నక్కబావా నావైపు చూస్తావు. తిను. నీకోసం కష్టపడి వండాను.' అని పైగా ఎగతాళి చేస్తుంది. కానీ నక్క ఏం చేయలేక. మూతి ముడుచుకొని కూర్చొంది. కొంగ తన కూజాలో చేప ముక్కలు అయిపోగానే, నక్క దగ్గరున్న కూజా దగ్గరకు వచ్చి 'ఇలా తినాల'ని ఆ చేపముక్కల్ని కూడా తినేసింది.
           నక్కకు తను చేసిన తప్పు తెలిసొచ్చింది. 'నన్ను క్షమించు కొంగబావా...' అని చెప్పింది. 'ఈసారి మళ్లీ మా ఇంటికి రా... నీకు తప్పక పాయసం వండిపెడతాను.' అని బ్రతిమాలింది. చివరకు కొంగ ఒప్పుకుంది. అలానే చేసిపెట్టింది. మళ్లీ కొంగ నక్కకు చేపలకూర కూడా వండి పెట్టింది. తర్వాత వారిస్నేహం మళ్లీ కొనసాగింది.
   నీతి- ఇంటికి వచ్చిన అతిథుల్ని గౌరవించాలి. స్నేహితుల్ని మోసం చేయకూడదు.