Facebook Twitter
అయ్యో పాపం కుయ్యో మొర్రో

అయ్యో పాపం కుయ్యో మొర్రో

- చంద్ర శేఖర్

ఒకానొక అడవిలో ఒక నక్క ఉండేది. అది చాలా టక్కరిది. ఆ అడవికి రాజు పులి. ఒక రోజున నక్క అడవిలో బడి పెడదామని అనుకున్నది. అది పులి దగ్గరకు వెళ్ళి "పులి రాజా! నేను ఈ అడవిలో బడి పెట్టబోతున్నాను. నాకు మీ అనుమతి కావాలి" అంది. పులి రాజు ఆలోచించి, "సరే, నువ్వు బడి పెట్టుకో" అని చెప్పి వెళ్ళి పోయింది.

వెంటనే నక్క అడవిలోకి పోయి "నెమలి, కోకిల, కోతి, కుందేలు, బాతు- అందరూ ఇలారండి! ఒరేయ్, దున్నపోతూ! నిన్ను వేరేగా పిలవాలారా?" అని అరిచింది. "సరేగానీ, సంగతి ఏంటో చెప్పు మరి!" అన్నాయన్నీ.

"ఏమీలేదు- నేను ఈ అడవిలో బడి పెడుతున్నాను. అందులో మీ పిల్లలకు గొప్పగొప్ప విద్యలు నేర్పిస్తాను. అయితే నాకు మీరంతా ప్రతిరోజూ మాంసం పెట్టాలి- ఇది పులిరాజు గారి ఆజ్ఞ. మీజంతువులూ, పక్షులూ అందరూ కలసి ఆలోచించుకోండి" అని చెప్పి వెళ్ళిపోయింది నక్క. సరే, ఇక

పక్షులు, జంతువులు అన్నీకలిసి మాట్లాడుకున్నాయి. మాట్లాడుకొని, "సరే నక్కా! నువ్వు బడి పెట్టుకో. మేం మా పిల్లల్ని పంపుతాం" అని చెప్పాయి.

నక్క బడిని ప్రారంభించింది. మొదటి రోజున పిల్లలందరి పేర్లనూ ఒక పుస్తకంలో రాసుకున్నది. "కోయిల పిల్లా! ఇటురా! ఈ నీటిలో ఈదు!" అని మొదలు పెట్టింది. "నాకు రాదు. నాకు రాదు" అన్నది కోయిల పిల్ల. "చెప్పింది చేస్తారా లేదా? మీరంతా క్రమశిక్షణ అంటే ఏంటో నేర్చుకోవాలి" అని నక్క మిగిలిన పక్షులన్నిటినీకూడా ఈదమన్నది. అవి ఏవీ అందుకు అంగీకరించలేదు. ఈదనందుకు నక్క వారిని బాగా కొట్టింది.

ఆ తరువాత అది కోతినీ, దున్నపోతునీ, ఇతర జంతువుల్నీ ఎగరమన్నది. వాటికి ఎగరటం రాలేదు. అందుకుగాను నక్క ఆ జంతువులన్నింటినీ కూడా కొట్టింది. తెలివైనది కనుక అది అందరినీ కొట్టింది; కానీ పులి పిల్లను మాత్రం కొట్టలేదు. నక్కతీరుకు పిల్లలందరూ దాన్ని అసహ్యించుకున్నారు.

మరుసటి రోజున దున్నపోతు నాన్న నక్కదగ్గరికి వచ్చింది. "నేను ఒక ప్రశ్న అడిగి నీ చెవులు మూసిపెడతాను. దానికి నువ్వు సమాధానం చెప్పాలి" అని అది నక్కతో అన్నది. "ఈ ఆట ఏదో బాగుంద"ని నక్క అందుకు ఒప్పుకున్నది. "వర్షాకాలంలో వర్షం వస్తుందా?" అని అడిగి, దున్నపోతు వచ్చి నక్క చెవులు మూసిపెట్టింది. సరిగ్గా అదే సమయానికి పులిపిల్ల వచ్చి "మా నాన్నకు ఎయిడ్స్ వస్తుందా?" అని అడిగింది.

దున్నపోతు తన చెవుల్ని మూసి ఉంచటం వల్ల నక్కకు ఆ ప్రశ్న అసలు వినబడలేదు. అది "వస్తుంది" అని సమాధానం చెప్పింది.

పులిపిల్ల వెంటనే పులి దగ్గరికి వెళ్లి ఈ విషయం చెప్పింది. అమాయకులైన పిల్లల వద్ద తన పరువు తీస్తున్నదని నక్కపై పులికి చాలా కోపం వచ్చింది. అది నక్కను బాగా కొట్టి, ఆ అడవి నుండి తరిమేయబోయేసరికి జంతువులు, పక్షులు అన్నీ వచ్చి "మా పిల్లలు కనిపించటం లేదు" అని పులిరాజుకు ఫిర్యాదు చేశాయి. నక్క పెట్టే బాదల్ని భరించలేక పిల్లలంతా ఆత్మహత్య చేసుకున్నాయని ఆరోపించింది కోతి తల్లి. దున్నపోతు కూడా "చూశారా, నేను చెబితే వినకుండా మీ పిల్లల్ని ఆ బడికి పంపి వాళ్లందరూ ఆత్మహత్య చేసుకోటానికి కారకులయ్యారు!" అన్నది.

పరిస్థితి తారుమారు అవుతున్నదని గ్రహించిన నక్క అందరి కళ్ళుగప్పి, మెల్లగా జారుకున్నది.

తమ పిల్లల్ని తలచుకొని, జంతువులు, పక్షులు చాలా బాధ పడసాగాయి. అది చూసి దున్నపోతు "మీరు ఏమీబాధ బాధ పడవలసిన అవసరం లేదు. మీ పిల్లలు ఆత్మహత్య చేసుకోబోతూ వుంటే నేను వెళ్లి, సర్ది చెప్పి, నా గుహ వద్ద క్షేమంగా వుంచాను" అని చెప్పి వాటిని తీసుకెళ్లి వారి పిల్లలను చూపింది. జంతువులన్నీ దున్నపోతుకు కృతజ్ఞతలు తెలుపుకుని ఎవరి ఇండ్లకు అవి వెళ్లిపోయాయి. బడిపేరిట నక్క తనను ఎంత మోసం చేసిందో చూసిన పులిరాజు ఇకపై తాను మరింత జాగ్రత్తగా ఉండాలని నిశ్చయించుకున్నది.

 

కొత్తపల్లి వారి సౌజన్యంతో