Facebook Twitter
మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? అనితా దేశాయ్

మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? అనితా దేశాయ్

అనితా దేశాయ్ Massachusetts Institute of Technology లో Humanities Professor గా పనిచేసింది. ఆమె ముస్సోరీలో జెర్మన్ తల్లికి బెంగాలీ తండ్రికి పుట్టింది. చిన్నప్పట్నుంచే ఇంగ్లీష్, జెర్మన్, బెంగాలీ, హింది, ఉర్ద్దు భాషలు నేర్చుకుంటూ పెరిగింది. ఏడేళ్ళ పసి ప్రాయం నుంచి రాయడం మొదలుపెట్టి, తొమ్మిదేళ్ళకే ఇంగ్లీష్లో రాసిన తన మొదటి కధ అచ్చు వేయించుకుంది. చదువంతా ఢిల్లీలో సాగింది. అశ్విన్ దేశాయ్ అనే కంప్యూటర్ సాఫ్ట్వేర్ కంపెనీ డైరక్టర్ని పెళ్ళి చేసుకుంది. ఆయనా రచయితే. Between Eternities : Ideas on Life and The Cosmos అనే పుస్తకాన్ని రాశాడు. వీరికి నలుగురు పిల్లలు. ఇద్దరూ రచయితలవడం వల్లేమో, కూతురు కిరన్ దేశాయ్ కూడా Man Booker Prize ఎవార్డ్ గ్రహీత.

ఆమె నవల In Custody సినిమాగా తీసారు, శషి కపూర్, షబానా ఆజ్మి, ఓం పూరి లతో. దీనికి President of India, award for best picture వచ్చింది. ఇదే నవల బుకర్ ప్రైజ్ కి నామినేట్ కూడా అయింది. ఇది కాకుండా ఇంకో రెండు నవలలు Clear Light of the Day, Fasting, Feasting అనే నవలలు కూడా బుకర్ ప్రైజ్ కి షార్ట్ లిస్ట్ అయ్యాయి. ఇవి కాకుండా కింద ఇచ్చిన లిస్ట్ అఫ్ ఎవార్డ్స్ కూడా ఆవిడకి వచ్చాయి.

Winifred Holtby Memorial Prize – Fire on the Mountain
1978 సాహిత్య ఎకాడమీ ఎవార్ద్ – Fire on the Mountain
1983 Guardian Childreen's Fiction Prize – The village by the Sea
1993 Neil Gunn Prize
2000 Alberto Moravia Prize for Literature (Italy)
2003 Benson Medal of Royal Society of Literature
2007 Sahitya Akademi fellowship
2014 Padma Bhushan

Royal Society of Arts, The American Academy of Arts and Letters, and Girton College, Cambridge ల్లో ఆమె ఫెల్లో. Newyork book Reviews కి కూడా రాస్తుంది. ఆమె నవలల్లో ఒక స్త్రీవాద రచయిత్రిగా ఆమె స్త్రీ పై పురుషుడి ఆధిపత్యం పైనా, స్త్రీలపైనా, వారి భౌతిక, మానసిక సమస్యలపైనా సానుభూతితో చేసిన చిత్రీకరణలు మన దేశంలో స్త్రీల జీవితాలపై ఆమెకున్న అవగాహనని తెలియ చేస్తాయి. అలాగే తమ స్వంత ప్రాంతాలు వదిలి పరాయి దేశాల్లో, ప్రాంతాల్లో స్థిరపడిన వారిలో ఉండే అస్తిత్వ రాహిత్యాన్నీ వివరించే పాత్రలూ కూడా ప్రశంశనీయమైనవి. ఎందుకంటే, ఆమె చిన్నతనంలో, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జెర్మనీలో యుద్ధ వాతావరణం, దాని పర్యవసానాల గురించి ఆందోళన చెందే తల్లి, జెర్మనీ వెళ్ళలేక పడే బాధని ఆమె స్వయంగా చూసింది. అలాగే ఢిల్లీ కల్కత్తా, ముంబాయి నగరాల్లోని జీవితమూ, అక్కడి సమస్యలూ కూడా ఆమెకు సుపరిచితమే. 26 ఏళ్ళకే ఆమె రాసిన మొదటి నవల Cry, the Peacock అనే నవల ఆమెను అంతర్జాతీయ స్థాయిలో ఇంగ్లీషులో రాసే ఒక ప్రతిభాశాలియైన భారత రచయిత్రిగా నిలబెట్టింది. ఆమె శైలి, భాషా ఇతివృత్తం అన్నీ ఆమెకు విమర్శకుల ప్రశంసలు తెచ్చిపెట్టాయి.

Cry the Peacock అనే ఈ నవలలో ప్రొటాగనిస్ట్ సున్నిత మనస్కురాలైన మాయ తల్లి లేని పిల్ల, అన్న అమెరికాలో చదువుకోవటానికి వెళ్ళిపోతాడు. తండ్రి లాయరు, డబ్బున్నవాడు. తల్లి లేదని ఎంతో గారాబం చేస్తాడు. ఆమె ఆడింది ఆట, పాడింది పాటగా సాగుతుంది తండ్రి దగ్గర జీవితం. ఆమె వివాహం గౌతమ తో జరుగుతుంది, ఇతనూ లాయరే. పేరుకు తగ్గట్టు మాయ మనసు చంచలం, జీవితం అంటే బొల్డు ప్రేమ. ప్రపంచం అంటే ఆమె కిష్టమైన రంగులేసిన బొమ్మ, తను చెప్పినట్టల్లా ఆడే బొమ్మ అని అనుకునే తత్వం. దీనికి విరుద్ధంగా, గౌతమ పేరుకు తగ్గట్టే గౌతమ బుద్దుడిలాగా జీవితం మీద అనాసక్తతో, నిర్లిప్తతో, లేక ఒక వేదాంత ధోరణితోనో ఉంటాడు. అతని ప్రకారం మాయని వాళ్ళ నాన్న అతిగా గారాబం చేసి చెడగొట్టాడు. పైగా ఆమె కోరికలని, ఆమె కోరుకునే ప్రేమనీ, అట్టెన్షన్నీ అతనివ్వలేకపోతాడు. మాయ చిన్నతనంలో ఒక జ్యొతిష్కుడు పెళ్ళయిన నాలుగేళ్ళలో, మాయా కాని ఆమె భర్త కాని చనిపోవచ్చని జోస్యం చెప్తాడు. పెళ్ళయి నాలుగేళ్ళయినప్పట్నుంచి ఆమె ఆ జోస్యం నిజమవుతుందని భయపడుతూంటుంది. తను చనిపోతుందేమోనని భయపడుతుంటుంది. ఇవేమీ గౌతమ పట్టించుకోడు. తన పనిలో ఎప్పుడూ మునిగి పోయి ఉంటాడు. ఆమె భయాలకి తోడు, భరించలేని ఒంటరితనం ఆమెని వేధిస్తూంటుంది. కొన్నాళ్ళు గౌతమ తల్లి చెల్లెలు వచ్చి ఉన్నపుడు ఆమెకు బాగుంటుంది. కాని వాళ్ళు వెళ్ళిపోయాకా మళ్ళా అదే సమస్య ఒంటరితనం. క్లబ్స్ కీ, పార్టీలకీ, స్నేహితురాలితోనూ సమయం గడిపి చూస్తుంది. కాని ఇంటికి తిరిగి రాగానే మళ్ళీ ఆమె ఆలోచనలు, భయాలూ వెంటాడుతుంటాయి. మెల్లి మెల్లిగా ఆమె తన మానసిక సంతులనం కోల్పోతుంటుంది. బ్రతకాలన్న ఆశ, చావంటే భయం ఆమెని చావు తనకు బదులు, జీవితం అంటే ప్రేమలేని తన భర్త కొస్తే బాగుండుననుకునేట్టు చేస్తుంది. ఒక వేళ అలా కాకుండా చనిపోవడం తన వంతయితే అన్న ఆలోచన ఆమెని గౌతమని తనే చంపేస్తే అన్న విపరీత అలోచనా ధోరణి వైపుకి నెట్టుతుంది. ఒక్కోసారి ఆమె పూర్తిగా పిచ్చిదానిలా ప్రవర్తిస్తుంది. ఆ పిచ్చిలో ఆమెకు ఎలకలు, బల్లులూ పాములూ పాకుతున్నట్టు భ్రమలు కలుగుతుంటాయి. ఇదే పిచ్చిలో ఒకరోజు గౌతమని మేడమీద చల్లగాలిలో నడు ద్దాం రమ్మని పిలుస్తుంది. అక్కడ అందమైన చందమామ, వెన్నెల చూస్తూ ఆమె తనని తాను మరచిపోతుంది. అటూ ఇటూ నడుస్తూ చందమామకి తనకి అడ్డొచ్చిన గౌతమని పిచ్చి కోపంతో ఒక్కసారిగా పారపెట్ వాల్ మీంచి నెట్టేస్తుంది. కింద పడి గౌతమ చనిపోతాడు. ఆమె అత్తగారు, ఆడపడుచూ మాయని తండ్రి ఇంట్లో దిగబెడతారు. ఇదొక విషాదమైన ముగింపు. రెండు భిన్న మనస్తత్వాలకి చెందిన వ్యక్తులు వివాహ బంధంలో ఎలా ఇమడలేరో, దాని పర్యవసానాలు ఎంత తీవ్రంగా ఉంటాయో చెప్పే కధ. తమ బిడ్డలకి జీవిత భాగస్వాములని వెదికే తల్లితండ్రులు ఎంతో ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం.

స్త్రీలపై ఆధిపత్యం, అణిచివేత ఆమె నవలల్లో ప్రధానాంశాలు. ఆమె ప్రతి నవలా ఒక మాస్టర్ పీస్. ఆమె నవలని చదవాలంటే చాలా టైం తీస్కుని చదవాలి, కష్టమని కాదు, నవలలోని ప్రతి కారక్టరూ జీవితంలో తారసపడే వ్యక్తుల్లా, సంఘటనల్లా, అలోచింపచేస్తూ, పాఠకుల అనుభవాల్నీ, అనుభూతుల్నీ మమేకం చేసుకుంటూ సాగేవే. ఆమె పాత్రలు గ్లోరిఫైడ్ మనుషులు కారు. మామూలు మనుషులు. అతి సాధారణ మనస్తత్వాలతో, సాధారణ జీవితాలు గడిపే, భాధలు కష్టాలు పడుతూ, అప్పుడప్పుడూ తమ తమ కకూన్లలోంచి బయటికి చూసే మామూలు మనుషులు. ఒక రచయిత్రికి పాఠకుల తరపునుంచి ఇంత కంటే గొప్ప ప్రశంశ ఏముంటుంది.

కొన్ని నవలల్లో పాత్రల స్వభావాల్నీ, కధనాన్నీ కూడా విస్మరిస్తూ వర్ణనలుంటాయని, దాని వల్ల ఒక్కోసారి కధ అర్ధం కాకపోవడం, తప్పుదారి పట్టినట్టనిపించడం జరుగుతుంటుందని కొందరి విమర్శ అయితే అదే కారణంగా ఆమె రచనల్ని ఇష్టపడే వారు కొందరు. ఆమె రచయిత్రి బదులు చిత్రకారిణి అయితే బాగుంటుందని కూడా కొందరు వ్యాఖ్యానించారు. ఏమైతేనేం, ఆమె మాత్రం తప్పక చదవాల్సిన రచయిత్రి.

-Sharada Sivapurapu