Facebook Twitter
మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? ప్రతిభ రే - ఒరియా

మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? ప్రతిభ రే - ఒరియా

 

ప్రతిభ 1943 లో కట్టక్ డిస్ట్రిక్ట్ లోని చిన్న గ్రామంలో పుట్టింది. పేరెరగని ఆ చిన్న ఊర్లోంచి, ఒడిస్సా లోని ప్రతి ఇంట్లోని పాఠకుడి మనస్సులోనూ, అనువాదాల ద్వారా ఇతర భాషా పాఠకుల మనస్సుల్లోనూ సుస్థిరమైన స్థానానికి ఆమె ప్రస్థానం ఒక అద్భుత పయనం. చిన్నప్పట్నుంచి ఆమెకాదర్శం ఆమె తండ్రి పరసురాం దాస్. స్వతంత్ర పోరాట యోధుడూ, గాంధేయవాదీ అయిన ఆయన టిస్కొ కంపెనీ లోని మంచి ఉద్యోగం ఒదులుకుని, పిల్లలను చదువుకోనివ్వని ఒక జమిందార్ల గ్రామంలో స్కూల్ నడిపి దాన్ని ప్రాధమిక పాఠశాలనుండి ఉన్నత పాఠశాల స్థాయికి తెచ్చాడట. సహజంగానే ఆయన తన కూతురికే కాదు అప్పటి యువతకి కూడా స్వతంత్ర పోరాటంలో పాల్గొనడానికి ఆదర్శమయ్యాడు. ఆయన కూడా కవే, తన పాటలు, కవితలతో యువతనుత్సాహపరిచేవాడట.

ప్రతిభ కూడా తన 9 వ ఏటనే ఒక అద్భుతమైన కవిత రాసి అప్పటి ప్రముఖ దినపత్రికకు పంపిందట రహస్యంగా. మరునాడే అది అచ్చయ్యితే తండ్రి స్నేహితులు చదివి ఆయనకు చెప్తే ఆయన సంతోషానికి అవధులు లేవట. కుంతలా కుమారి సబత్, ( ఈమె గురించి మనం ఈ Colomn లో చదివాం) లాగా ఒక డాక్టరయి కవయిత్రి కూడా అవుతుందని ఆశించాడు, కానీ వైద్య విద్య అంటే అంతగా ఆసక్తి లేని ప్రతిభ వైద్య కళాశాలలో చేరాకా తండ్రికి చెప్పకుండా మానేసి సైన్సు చదువుకుందట. పెళ్ళి తరవాత కూడా ఆమె తన రచనలు ఆటంకం లేకుండా కొనసాగించింది ముగ్గురు పిల్లల తల్లయి కూడా. వాళ్ళు స్కూల్ కెళ్ళాకా చదువుకుంటూ ఆమె ఎడ్యుకేషన్ లో మాస్టర్స్, పీ హెచ్ డీ ఎడ్యుకేషనల్ సైకొలొజీ లో చేసిందట.

బోండా ట్రైబ్ ఒడిస్సా లోని అతి పురాతనమైన్ ట్రైబ్. నాగరిక సమాజానికి అతి దూరంగా వీరి జీవనం ఇప్పటికీ కూడా. ఆమె రిసెర్చ్ పేపర్ “Tribalism and Criminology of Bonda Highlander” మీద చేసింది. దీనికోసం ఆమె ఎంతో ధైర్యంగా, మగవారుకూడా సాహసించని విధంగా వారితో నెలల తరబడి సహజీవనం చేసేదట.

ఆమె మొట్టమొదటి నవలే ఒడిస్సాలో బెస్ట్ సెల్లర్. ఆమె 20 నవలలు, 24 కధా సంకలనాలూ, 10 ట్రావెలాగ్స్, ఇంకా లెక్క లేనన్ని వ్యాసాలూ రాసింది. ఇండియాలో, ప్రపంచమంతా, కూడా ఆమె విస్తృతంగా పర్యటించింది. ఆ అనుభవాలే ఆమె ట్రావెలాగ్స్గా రాసింది. ఆమె ఎందరివో రిసెర్చ్ పేపర్స్కి గైడుగా వ్యవహరించింది, వృత్తి రీత్యా ప్రొఫెసర్ కాబట్టి. ఇక ఆమె కొచ్చిన పురస్కారాలకొస్తే, ఆమె 47 వ జ్ఞానపీఠ (2011) ఎవార్డ్ గ్రహీత, ఒడిస్సాని తీస్కొంటే మొట్టమొదటి రచయిత్రి ఇంతటి అత్యున్నత పురస్కార గౌరవానికి.

    1985 – 'Odisha Sahitya Academi Award' for her novel 'Sheelapadma'

    1990 – 'Sarala Award' for her novel 'Yajnaseni'

    1991 – 'Moortidevi Award' for her Novel 'Yajnaseni'

    2000 – 'Sahitya Akademi Award' for her Short-Story Collection 'Ullaghna'

    2006 – 'Amrita Keerti Puraskar'[10]

    2007 – 'Padma Shri Award' in Literature and Education by the Government of India.

    2011 – 'Jnanpith Award'

    2013 – Odisha Living Legend Award (Literature)

 

మొదటినుంచీ కులమత రహిత, వర్గ రహిత సమ సమాజం ఆమె ఆశయం. ఏరకమైన వివక్షనీ ఆమె సహించలేదు. పూరి జగన్నధాలయంలో జరిగే అక్రమాలకి వ్యతిరేకంగా ఆమె ఒక వ్యాసం "The Colour of Religion is Black" రాసి, కోర్ట్ కేసులో పదేళ్ళు ఇరుక్కుంది. అయినా ఆమె దేనికీ వెరవలేదు. వైష్ణవ భక్తురాలై ఉండీ, గుళ్ళలో జరిగే అన్యాయాలనూ, దేవుని పేర జరిగే అక్రమాలనూ, జాతి, మత, రంగు వివక్షలనూ, భేదాలనూ ఖండించడానికీ, నిరసించడానికీ వెనుకడుగు వేయలేదు. ఆమెను విమర్శించిన వారు ఆమెను కమ్యూనిస్టుగానూ, ఫెమినిస్టుగానూ ముద్ర వేస్తే వ్యతిరేకిస్తూ ఆమె, నేను మానవతావాదిని అని చెప్పుకుంది. ఆమె ఉద్దేశ్యంలో స్త్రీ పురుషులిద్దరూ సమానమే, అయితే వేరు వేరు బాద్యతల్ని నిర్వర్తించడానికి అనుకూలంగా ఉన్నారు ఈ సృష్టి క్రమంలో ; ఈ స్త్రీ పురుష సహజత్వాన్ని గౌరవించి కాపాడుకోవాలి కాని ఒకరినొకరు చిన్నచూపు చూడాల్సిన అవసరం లేదని ఆమె అభిప్రాయం.

యజ్ఞసేని అనే నవలకి అరుదైన మూర్తీ దేవి ఎవార్డ్, సరళా ఎవార్డూ వచ్చాయి. అయోనిజ అయిన ద్రౌపది గురించి, ద్రౌపది కోణం నుంచే రాసిన నవల. సహజంగానే ఇందులో యుద్ధ పర్వం ఉండదు. చిన్నప్పటినుంచి చనిపోయేవరకూ ద్రౌపది జీవితంలో జరిగిన సంఘటనల ప్రభావం ఆమె మీద ఎలాఉంది, ఒక సున్నిత హృదయం గల స్త్రీగా ద్రౌపది స్పందన ఎలాంటిది అన్న విషయాన్ని అద్భుతంగా చిత్రించింది. అయితే దీనిమీద విమర్శలు కూడా చాలానే ఉన్నాయి. ప్రారంభంలో నవల సాగదీసే సంభషణలతో, ఇమోషనల్ మెలోడ్రామా కొంచం ఎక్కువైందని. ద్రౌపదిని చిత్రించిన విధానం ఐదుగురి భర్తలకి సేవ చేస్తూ, ప్రేమించింది అర్జునుడినైనా కుంతీదేవి మాట నిలబెట్టడం కోసం ఇష్టంలేకపోయినా మిగిలిన నలుగురినీ పెళ్ళిచేసుకుని, తన చుట్టూ ఉన్న ప్రపంచం ఆమె పాతివృత్యాన్ని నిరంతరం హేళన చేస్తుంటే సహిస్తూ, ఎక్కువకాలం అరణ్యవాసాల్లోనూ, అజ్ఞాతవాసాల్లోనూ అష్టకష్టాలూ పడుతూ, వస్త్రాపహరణానికి గురయి, తనని కాపాడలేని భర్తల మీద ఏహ్యత వ్యక్తపరుస్తూనే, వారిని గౌరవిస్తూ ఆమె నరక యాతన పడితే, చివరికి కురుక్షేత్ర యుద్ధానికి కారకురాలిగా, తనదైన శైలిలో అప్పుడప్పుడూ సహనం కోల్పోయి తిరుగుబాటు చేసిన స్త్రీగా మిగిలింది. యుద్ధంలో తన పుత్రులని కోల్పోయి ఆమె ఏం మిగుల్చుకుంది? పతివ్రత అయ్యుండీ, పంచ భర్తృక అయినందువల్ల పాతివృత్యానికి ప్రతీకగా ఎన్నడూ కొనియాడబడలేదు. చివరకు చనిపోయేముందు కాలుజారిపడిన ఆమెను నిస్సహాయంగా వదిలి భర్తలందరూ స్వర్గానికి వెళ్తూ, తిరిగికూడా చూడకుండా వెళ్ళిపోయారు. ఐదుగురు భర్తలతో జీవించగల్గటం ఏమైనా ఆమెకు సంతోషం స్వేఛ్చనిచ్చాయా అంటే అదీ లేదు. ఐదుగురు భార్యలున్న పురుషుడికి లేనటువంటి ఆంక్షలన్నీ ఆమెకు విధించబడ్డాయి. అయినప్పటికీ తను ప్రేమించిన అర్జునుడి గురించి ఇతర భర్తల వద్ద ఉన్నపుడు అలోచించకుండా ఉండలేకపోతున్నానవి వాపోతుంది. ఇదీ ఆమె కోరుకున్నది కాదు. ఆమె అంతగా ప్రేమించిన అర్జునుడి మిగతా భార్యలతో సర్దుకోవటం మళ్ళీ తప్పలేదు. అయితే ఇందులో ప్రతిభా రే మీద విమర్శ ఏంటంటే వీటిని వేటినీ ఖండించకుండా, ఇన్ని కష్టాలు పడ్డా ద్రౌపది భర్తల పట్ల నెరపిన పాతివృత్యాన్ని మాత్రం ఉటంకిస్తూ, ఆమె పాత్రని glorify చేసి, సరిగా అర్ధం చేసుకుని జాలిపడమని మాత్రమే రచయిత్రి అభిప్రాయం అని.

ఏమైనా ఈ నవలకి రెండు ప్రతిస్ఠాత్మక పురస్కారాలొచ్చాయి. ఇంగ్లీష్, తమిల్, మలయాలం, అస్సామీ, మరాఠీ, పంజాబీ, హంగేరీ భాషల్లోకి అనువదించబడింది.

మానవతా విలువల్ని అతిక్రమించే ఏ సంప్రదాయమైనా మారాల్సిందే. లేకపోతే అది మనిషి మెడలో వేలాడే విషసర్పంలాంటిదని ఆమె అభిప్రాయం. స్త్రీల హక్కుల కోసం పోరాడటం ఆమె తండ్రివద్దనుంచే నేర్చుకుంది. అలాగే తను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి శ్రమించడం కూడా. ఆమె మీద విమర్శ ఎలా ఉన్నా ఆమె నిబద్ధతని అనుమానించే ప్రసక్తి లేని విధంగానే ఆమె మొదటినుంచీ పనిచేస్తూ వచ్చింది. ఒక రచయిత్రికి ఇంతకంటే ఉండాల్సిన అవలంబించాల్సిన గొప్ప జీవన విధానం ఏముంటుంది?

 

-Sharada Sivapurapu