మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి?
ఇస్మత్ చుగ్తాయ్ -ఉర్దు

ఇస్మత్ చుగ్తాయ్ ప్రఖ్యాత ఉర్దూ రచయిత్రి బదయూన్, ఉత్తర ప్రదేశ్ లో పదిమంది పిల్లల్లో తొమ్మిదవ సంతానంగా పుట్టింది. అక్కలందరికీ పెళ్ళిళ్ళయిపోవడంవల్ల ఆమె తన అన్నలతోనే బాల్యాన్ని గడిపింది. ఆమె ధైర్యంగా రాయడానికి కూడా ఆమె పేర్కొనే కారణం అదే. ఆమె అన్న మిర్జా అజీం బైగ్ చుగ్తాయ్ అప్పటికే పేరు తెచ్చుకున్న రచయిత. ఈమెను ప్రోత్సహించి రచయిత్రిగా తీర్చిదిద్దటంలో అతని పాత్ర చాలా ఉంది. ఆమె బి యే ఆతరవాత బి యీ డీ చేసింది. ఆకాలంలో ఆమే మొదటి ముస్లిం స్త్రీ రెండు డిగ్రీలు చదివినది. ఆతరగతులు హాజరవడానికి ఈమె ఈమెతోబాటు ఇంకొద్ది మంది అమ్మాయిలూ, క్లాసులో వెనకాల ఒక పరదా వెనక కూర్చుని పాఠాలు వినేవారట. కేవలం చదువుకోవాలనే ఆశ తీర్చుకోవడం కోసం ఏం చెయ్యడానికైనా సిద్ధంగా ఉండేవాళ్ళం అని చెప్తుంది. మతసామరస్యం రచనల్లో చెప్పడమే కాదు, తన కూతురిని హిందూ అబ్బాయికిచ్చి పెళ్ళి చేసింది. మా బంధువుల్లో, హిందువులు, క్రిస్టియన్లూ ముస్లింలూ అందరూ ఉన్నారని చెప్పేదట. ఇదంతా ఆమె సంపన్న, విద్యావంతులైన కుటుంబంలో పుట్టడంవల్ల సాధ్యపడుండచ్చు.
తన కాలేజీ రోజుల్నుంచే రహస్యంగా రాయటం మొదలు పెట్టింది. ఎందుకంటే ఆమె చాందసవాద బంధువులందరికీ ఆమె చదువుకోవటమే ఇష్టంలేదు. సమకాలీనులైన కొర్రతులైన్ హైదర్, హిజాద్ ఇంతియాజ్ అలీ, డాక్టర్ రషీద్ జెహాన్లు ఆమెనెంతో ప్రభావితం చేసారు ఆమె చిన్నతనంలో. సమకాలీన సమాజం, ఇంగ్లీష్ పరిపాలన వారి ప్రభావం, హిందూ ముస్లిం సంస్కృతులమీదా, సభ్యతా సంస్కారాలమీదా, ఆమె పెరిగిన వాతావరణం ఇవన్నీ ఆమె రచనల్లో స్పష్టంగా కనిపిస్తాయి.
ఆమె రచనలన్నీ కధలూ, నవలా రూపంలోనే సాగాయి. 1941 లో స్క్రీన్ రైటర్, డైరక్టర్ అయిన షహీద్ లతీఫ్ ని వివాహం చేసుకొంది. ఈయన జిద్దీ, ఆర్జూ లాంటి సినిమాలు తీసాడు. పెళ్ళి తరవాత ఆమె భర్తతో కలిసి సినిమా స్క్రిప్ట్ రైటింగ్ కూడా చేసింది. జునూన్, ఆర్జూ, జిద్దీ, గరం హవా సినిమాలకు మాటలూ, కధా రాసింది. మై డ్రీంస్ (డాక్యుమెంటరీ), ఫరేబ్, జవాబ్ ఆయేగా సినిమాలకు డైరక్షన్ వహించింది.
ఇవన్నీ ఆమె కొచ్చిన ఎవార్డ్స్.
1974: Ghalib Award (Urdu Drama): Terhi Lakeer
1975: Filmfare best Story Award Garam Hawa (with Kaifi Azmi)
1982: Soviet Land Nehru Award
1990 Iqbal Samman (Iqbal Award) from Rajasthan Urdu Akademi for the year 1989
ఆమె రాసిన కధల్లో చాలా కధలు బాన్ అయ్యాయి. ఎందుకంటే జనానా లోని స్త్రీల గురించిన నిజాలు వాళ్ళ లాగానే మరుగున ఉండాలి గానీ జనాలలోకి రాకూడదు. నిజాన్ని శక్తివంతంగా కప్పెట్టి ఆ మురుగులో ఏమీ ఎరగనట్లు, ఏమీ జరగనట్లు నటించే సభ్య సమాజానికి నిజాలు నిక్కచ్చిగా చెప్తే తట్టుకునే శక్తి ఉండదు. ముప్పై ఏళ్ళ వయసులో ఆమె రాసిన లిహాఫ్ ( English: The Quilt) అనే కధ అచ్చయిన వెంటనే ఆ పత్రిక ఎడిటర్కి చాలా ఉత్తరాలు విమర్శిస్తూ వచ్చాయి, అలాంటి కధని అచ్చు వెయ్యడానికి ఎలా ఒప్పుకున్నారని. ఆ తరవాత ఆ కధలో అశ్లీలత ఉందని కేస్ వేసారు. చాలా గొడవ జరిగింది ఇస్మత్ క్షమార్పణ అడగాలని, కధను వెనక్కి తీసుకోవాలని. అయితే ఇస్మత్ ఇందుకు భిన్నంగా కోర్టులో పోరాడడానికే నిశ్చయించుకుని, కేసు గెలిచింది. ఈ కధ ఒకటే కాదు బాన్ అయ్యింది చాలానే ఉన్నాయి. అంగారే అనే కధలో కూడా, ముస్లిం ఆడవాళ్ళు నిఖాబ్ (ముసుగు) వేస్కోవటం పురుషాధిక్యతకీ, పెత్తందారీ సంస్కృతికి చిహ్నమని, అది ఆడవారికి అవమానమనీ రాసినందుకు బాన్ అయ్యింది.
ఈ లిహాఫ్ అనేది చిన్న కధ. దీన్ని షార్ట్ ఫిల్మ్ గా కూడా తీసారు. చాలా చక్కని కధ. రచయిత్రి ఒక ఎనిమిదేళ్ళ పాప ద్వారా వుమన్ సెక్సుయాలిటీ గురించి చెప్పే కధ. ఎనిమిదేళ్ళ అమీరణ్ ని వాళ్ల అమ్మ ఒక నవాబ్ భార్య అయిన తన సవతి చెల్లెలు దగ్గర వదిలిపెడుతుంది, తను ఊరెళ్ళినపుడు ఇంట్లో ఉంటే మగపిల్లలతో చేరి అల్లరిగా తిరుగుతుందని. కానీ ఇక్కడ పరిస్తితి చాలా విచిత్రంగా ఉంటుంది ఈ ఎనిమిదేళ్ళ అమీరణ్ కు. నవాబు తన అందమైన భార్య కేసి కన్నెత్తి కూడా చూడకుండా చుట్టుపక్కల పేద మగపిల్లల చదువు చెప్పించి వారి బాగోగులు చూసే కార్యక్రమంలో మునిగి ఉంటాడు. అయితే అతనికి సమయం దొరకక కాదు గానీ భార్య అంటే ఎటువంటి ఆసక్తి లేక అలా ఉంటాడు. ఇక ఈమెకు అన్ని భోగాలూ ఉన్నా భర్తతో సుఖంలేక అల్లాడుతుంటుంది. ఆమె లెస్బియన్ ఏమీ కాదు గానీ కేవలం మనిషి స్పర్శ కోసం ఆత్ర పడుతుంటుంది. అందుకని ఆమెకు శరీరం మీద ఎప్పుడూ విపరీతమైన దురద, టీలు తాగి తాగి తలనొప్పి ఉంటాయి. చివరికి ఆమెను చూడటానికి వచ్చిన డాక్టర్ కూడా ఆమెను ఆదృష్టితో తాకలేదని బాధ పడుతుంది. అయితే ఆమెకున్న ఒక పనిమనిషి ఈమె ఈ అవసరం తీరుస్తుంటుంది. వీరిద్దరి మధ్య రాత్రి జరిగే వ్యవహారం ఈ పాపకి భయం కలిగిస్తుంది. ఎవరో దొంగలున్నారని భయపడుతుంది. ఇలా ఉండగా ఆ పనిమనిషి ఊరెళుతుంది. ఈమె దురదా అధికమవుతుంది. విషయం తెలియని అమీరణ్ నేను గోకుతానంటూ ముందుకొస్తుంది. అప్పుడు నవాబు భార్య ప్రవర్తించిన తీరు అమీరణ్ కి భయం, కోపం , అసహ్యం, దుఖం పుట్టిస్తాయి. తన తల్లి తనకి ఎంత శిక్ష వేసిందోనని బాధ పడుతుంది. అంతే రాత్రికి రాత్రి తన బట్టలు సర్దుకుని ఒక్కతీ చీకట్లొ వెళ్ళిపోతుంది.
కధ మొత్తం విన్నాకా కోర్టుకి కూడా ఇందులో అశ్లీలత లేదని ఒప్పుకోక తప్పలేదు. లిహాఫ్ లాంటి కధలు ఇప్పుడైతే చాలానే చదువుతున్నాము కానీ 1940 ల ప్రాంతాల్లో వచ్చిన కధ. ఇటువంటి విషయాలు మాట్లాడటమే తప్పుగా, ఇబ్బందిగా భావించే రోజుల్లో మరి ఇలాంటి కధ రాయటానికి చాలానే గట్స్ కావాలి ఏ రచయితకైనా. అది ఒక ముస్లిం రచయిత్రి చెయ్యటం నిజంగా మెచ్చుకోతగ్గ విషయం.
ఇంకొక కధలో పెళ్ళి నిశ్చయమయిన ఒక ముస్లిం అమ్మాయి సరిగ్గా పెళ్ళికి ముందు తన హిందు ప్రియుడితో పారిపోతుంది. వారిద్దరూ సివిల్ మేరేజ్ చేసుకుంటారు. తప్పక అబ్బాయి తల్లితండ్రులు వీరిద్దరినీ చేరదీస్తారు. అక్కడ వాళ్ళలో ఒకరుగా కలిసిపోతుంది అంటే మతపరంగా. కొన్నాళ్ళ తరవాత అమ్మాయి తండ్రి వీరింటికి వస్తాడు. జరిగిందేదో జరిగింది ఇంటికి రమ్మని ఆహ్వానిస్తాడు భార్యా భర్తలిద్దరినీ. వారి వివాహాన్ని తనిప్పుడు సమర్ధిస్తున్నానని చెప్తాడు. దానికందరూ సంతోషించి వీరిద్దరినీ పంపడానికి ఒప్పుకుంటారు. అయితే తరవాత కూతురికి తెలుస్తుంది తండ్రి తనకి ఘర్ వాప్సీ, భర్తకి మతం మార్పిడీ ప్లాన్ చేసాడనీ ఆ తరవాత ముస్లిం పద్ధతిలో వివాహమూ అని.
మనసులో ఇంత ద్వేషం పెట్టుకుని తన తండ్రి పైకి ఎంత మంచివాడుగా నటించాడో తెలుసుకొని ఆశ్చర్యపోతుంది. అంతే ఇద్దరు తల్లితండ్రులకొక ఉత్తరం రాసి ఎక్కడికి వెల్తున్నారో చెప్పకుండా వెళ్ళిపోతారు. తల్లితండ్రులు తమ పంతం నెగ్గించుకోవడం కోసం పిల్లల దగ్గర కూడా ఎన్ని నాటకాలాడటానికైనా, ఎన్ని అబద్ధాలు చెప్పటానికైనా, తమ మతాన్నీ సంస్కృతినీ కాపాడుకోవటం కోసం అని అనుకుంటూ ఏమైనా చేస్తారని చెప్తుంది.
ఆమె అంటుంది కవులందరూ అబద్ధాలు రాస్తారు. అయితే అబద్ధాలని నిజంలాగా ఎంత చాకచక్యంగా రాయగలరనేది వారి ప్రతిభని బట్టీ ఉంటుంది. నిజ జీవితంలోని సంఘటన్లలోంచి సృష్టించే పాత్రలు వారి స్వభావాలు నిజానికి ఎంత దగ్గరగా ఉంటే బాగుంటుందో ఆమెకు తెలుసు. అందుకే ఆమె సృష్టించిన పాత్రలు ఎప్పుడూ కల్పిత పాత్రల్లా ఉండవు. అచ్చంగా మనం చూసే, వినే మనుషుల్లాగానే ప్రవర్తిస్తాయి. నిర్భయంగా మాట్లాడుతాయి. సమాజాన్ని ప్రశ్నిస్తాయి. భుజాలు తడుముకునేట్టు చేస్తాయి. సిగ్గుపడేట్టు చేస్తాయి.
అటువంటి సమాజ పోషకుల్ని వారి స్వార్ధాన్నీ తోలు వలిచి నగ్నంగా ప్రపంచం ముందు నిలబెట్టి బెంబేలెత్తేట్టు చేస్తాయి. అందుకే ఆమె రాయటం మొదలు పెట్టినప్పట్నుంచి ఆమెపై ఆమె రచనలపై విపరీతమైన వ్యతిరేకత ఉంది. ఎంతో కువిమర్శని వెలివేతనీ ఆమె ఎదుర్కొంది. ఆమె మత సామరస్యం గురించి రాయటమే కాదు, జీవించి చూపించింది. ఆమెకు ఖురాన్ ఎంత పవిత్రమో గీత బైబిలు కూడా అంతే పవిత్రమని చెప్పింది.
.png)
-Sharada Sivapurapu



