మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి?
కుంతలా కుమారి సబత్

జగ్దల్పూర్, బస్తర్ లో పుట్టిన కుంతలా కుమారి తల్లి మోనికా, తండ్రి డేనియెల్ 14 ఏళ్ళ వరకూ బర్మాలో పెరిగింది. కానీ తండ్రి రెండో పెళ్ళి చేసుకోవటంతో తల్లి తో బాటుగా ఇండియా తిరిగి వచ్చి, కుర్దా డిస్ట్రిక్ట్ లో స్థిరపడింది. కటక్ లో మెడిసిన్ చేసింది. ఈమె ఒక పేరు పొందిన లేడీ డాక్టర్. అయితే ఈమె స్కూల్ వయసునుంచే కవిత్వం రాస్తూ వచ్చింది ఒరియా, హిందీ భాషల్లో. బెంగాలీ, ఇంగ్లీష్ లో కుడా రాసిందట. ఎన్నో ఒరియా జర్నల్స్ కి వ్యాసాలు రాసేదట. 1928 లో ఒక డాక్టరుని కులాంతర వివాహం చేసుకోవడం కోసం బ్రహ్మొ సమాజంలో చేరుతుంది.
వ్యక్తిగత జీవితానికొస్తే నలుగురు పిల్లలు కానీ, ఆమె చనిపోయేనాటికి ఇద్దరే మిగిలారు. ఆమె జీవితంలో ఇంత దుఖం ఉన్నా దాన్నిఆమె తన జీవితాశయాలకి ఏమాత్రం అడ్డు రానియ్యలేదు.
ఆమెకు వచ్చిన పురస్కారాలు:
"ఉత్కల్ భారతి”, ఇచ్చినది ఒరిస్సా పొయెట్స్ ఎస్సొసీషన్
"భారత్ కవినెత్రి,”, ఇచ్చింది హిందీ ప్రచార్ సభ
ఆమెను "నైటింగేల్ ఆఫ్ ఒరిస్సా" గా ముద్దుగా పిలుచుకుంటారట.
ఆమె రచయిత్రిగానే కాకుండా, రాజకీయాల్లో కూడా చాలా చురుకుగా పాల్గొనేది. పైగా అప్పుడు, స్వతంత్రోద్యమం దేశమంతటా ఊపందుకుంటున్న రోజులు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశాన్ని ఒరిస్సాలో ఏర్పాటు చెయ్యడంలో ఆమెదే ముఖ్య పాత్ర. కొన్నాళ్ళ పాటు ఆమె ఢిల్లీలో ఉంది. ఆ సమయంలో అక్కడి కవులతో చురుగ్గా సమావేశాల్లో పాల్గొనడం, అంతే కాకుండా, బెనారస్ యూనివర్సిటీలో లెక్చర్స్ ఇవ్వడానికి ఆమెను ఆహ్వానించేవారట. ఆమె అలిగర్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ కూడా. ఆమె విధవ స్త్రీల పునర్వివాహాలకీ, బాల వివాహాలరికట్టడానికీ పని చేసే ఒక ఆర్గనైజేషన్ కి కూడా ప్రెసిడెంట్.
ఆమె నిజమైన గాంధీ అనుయాయి. ఆయన సిద్ధాంతాన్ని జీవితంలో తూచ తప్పకుండా పాటించినది. తన కవితల్లో ఎప్పుడూ గాంధీగారాశించిన గ్రామ స్వారాజ్యాన్ని, సమ సమాజాన్ని, స్త్రీ స్వేఛ్చనీ, కార్మిక కర్షక ప్రగతినీ కలలు కన్నది. తన వంతు ప్రయత్నం ఎటువంటి లోపం లేకుండా చేసింది.
ఆమె రాసిన కవితా సంకలనాలు:
బారామాలా ఇన్ హిందీ 1922
ఉచ్చ్వాస్ 1924
అర్చన 1927 : పేద, వెనుకబడ్డ వర్గాల గొంతుల ప్రతిధ్వని
స్ఫుల్లింగ్ 1929 : స్వాతంత్రోద్యంలో పాలు పంచుకోవడానికి యువతకిచ్చిన పిలిపు. గతాన్ని మరిచి వారి భవిష్యత్తుకి పునాదులు వేస్కోవటానికి ప్రేరణ.
ఆహ్వాన్ 1930 : దేశం మొత్తానికి గాంధియన్ మూవ్మెంట్లో జాయిన్ అవ్వటానికి పిలుపు
ప్రేం చింతామని 1930
ఒరియంక ఖండన 1937
గర్జత్ క్రిషక 1939 : పేదలు, కర్షకులు ధనిక వర్గాల చేతుల్లో దోపిడీకి గురవ్వడం గురించి ఆమె బాధని వ్యక్తం చేస్తుంది. అలాగే డాక్టరుగా Human Anatomy ఒకటే కాకుండా సామ్రాజ్య వాద కలోనియల్ ప్రభుత్వం బానిస దేశపు శరీరంపై చేసే దోపిడీ ఎనాటమీ కూడా ఆమెకు బాగా తెలుసు.
మచ్చుకి ఆమె రాసిన పోయెం ఒకటి ఇక్కడ ఇస్తాను. ఇదొక భాగం మాత్రమే పూర్తి పోయెంలో.
Oh my compatriet!!
The man is not born
To die of reminiscence
or to sink in somewhere
It is never a human fate
that gets terminated through a
happiness, living
After being condemned to
The fretful glooms of failure
In a deprived morbid prison of
ever-disciplined humiliating;
Thus great earth is
Never a decaying caravan
Or a lady nurturing death.
Xxx
ఆమెకు ప్రకృతి, దాని అందం, ప్రేమా సహజత్వం ఎంతో ఇష్టం. మనిషితో సహా ఆమె అన్నిటిలోనూ ఒక ఆధ్యాత్మిక కోణం చూడగల్గటం ఆమె రచనల్లోని ఒక ప్రత్యేకత. స్వేఛ్చగల ప్రపంచం సాధించాలంటే, ప్రేమలో, మంచితనంలో, జ్ఞానంలో, సత్యంలో నమ్మకముండడం ముఖ్యమని ఆమె విశ్వాశం. అందుకే ఆమె పొయెట్రీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. అందుకే నైటింగేల్ అఫ్ ఒరిస్సాగా పిలువబడింది.
సరోజినీ దేవి నాయుడూని, కుంతలా కుమారినీ పోలుస్తారు చాలా విషయాల్లో. కాకపోతే, సరోజినీ దేవి నాయుడూలా విదేశాల్లో విద్యాభ్యాసం చేసె అరుదైన అవకాశాలు లభించేంత అదృష్టం ఈమెకు లేదు. ఇద్దరూ కవయిత్రులే, ఇద్దరూ స్వాతంత్రోద్యమకారులే. ఇద్దరూ గాంధీ అడుగుజాడల్లో నడిచిన వారే. సరోజిని దేవి నిజం చెప్పాలంటే సిద్ధాంత పరంగా గాంధీ గారి కన్నా, గోఖలే గారి వల్ల ఎక్కువ ప్రభావితమైంది. చాలా విచిత్రంగా, సరోజినీ దేవి స్వాతంత్రం వచ్చిన అనంతరం, నిజాం పాలిత ప్రాంతం భారత్ లో చేరకుండా స్వయం ప్రతిపత్తిగల సంస్థానంగా ఉండడాలని కోరుకోడాన్ని సమర్ధించింది. ఇది కేవలం ఆమె లండన్ చదువుకి, నిజామే ఆర్ధిక సహాయం అందిచడం కావచ్చు. ఆమె తండ్రి స్థాపించిన హైదరాబాదు కాలేజ్ కూడా నిజాం కాలేజ్ గా పేరు మార్చుకుంది. పైగా ఆమె కుటుంబానికి నిజాంతో దగ్గర సంబంధాలు ఉండేవట. అయితే స్వయం ప్రతిపత్తి ఇవ్వడానికి ఇది కారణం కాకూడదు. ఈ రకంగా చూస్తే, కుంతలా కుమారిలో ఇటువంటి వైరుధ్యాలు లేవు. అయినా సరోజినీకి వచ్చిన కీర్తి ప్రతిష్టలూ, పదవులూ గౌరవాలూ ఆమెకు దక్కలేదు. నిజానికి దక్కడానికి ఆమె జీవించి కూడా లేదు.
ఆమె కవితల్లో అంధ విశ్వాశాలకీ, మూఢ నమ్మకాలికీ వ్యతిరేకంగా ధ్వజం ఎత్తింది. ఆమె ఎప్పుడూ ఒక నూతన సమాజాన్ని గురించి రాసింది ఆమె కవితల్లో. ఆమె కీర్తి కవయిత్రిగా, దేశభక్తురాలిగా దేశమంతా వ్యాపించింది ఆ రోజుల్లో.
ఆమె 5 నవలలు కూడా రాసింది 1923 – 1933 మధ్య కాలంలో.
1.భ్రాంతి
2.నా తుండి
3.కాలి బహూ
4.రఘు అరాఖిత
5.పారస్మని
రఘు అరాఖిత్ అనే నవలకి ఆమె అతి ముఖ్యమైన ఒవుట్ స్టాండింగ్ వర్క్ గా పేరు. ఈ నవల పెళ్ళి యొక్క సామాజిక లక్షణాన్ని వివరిస్తూ, ఒక పెళ్ళికూతురి కుటుంబానికి పరిహారం చెల్లించడాన్ని గురించి రాసింది.
కాలి బహు అనే నవల అప్పటి సామాజిక వాతావరణానికి అద్దం పడుతుంది. ఒక నల్లటి ఒంటి రంగున్న లక్ష్మి అనే పిల్లకి వాళ్ళ నాన్న ఏడేళ్ళకి పెళ్ళి చేస్తే పదేళ్ళకల్లా విధవయి తిరిగి వస్తుంది. తల్లి లేని పిల్ల. తండ్రి నల్గురు భార్యలు అందులో చివరి ఇద్దరు భార్యలూ ఇంచుమించు లక్ష్మి వయసువారే. ఇక్కడ లక్ష్మికి విధవ పాటించాల్సిన కఠిన నియమాలు నిష్టలూ, చప్పిడి కూడూ అయితే ఆమె కళ్ళ ముందే, ఆ నల్గురు సవత్తల్లులూ ముత్తైదువలుగా దర్జా వెలగ బెడుతుంటారు. లక్ష్మిని రాచి రంపాన పెడుతుంటారు. ఇదొక ఎత్తైతే, హఠాత్తుగా తండ్రి చనిపోతాడు. అప్పుడు లక్ష్మి బతుకు ఇంకా హీనమైపోతుంది. ఇంతే కాకుండా లక్ష్మి వెంటపడి వేధిస్తుంటాడొకడు. ఇవన్నీ తట్టుకోలేక బృందావనం లోని విధవాశ్రమానికి పారిపోతుంది. కానీ అక్కడ బయటికి నియమానుసారంగా జీవిస్తున్నట్టు నటిస్తూ, లోపల విలాసాలలో మునిగి తేలే విధవ స్త్రీలను చూసి అక్కడ ఉండలేక వేరే దారి లేక నదిలో దూకి ఆత్మహత్యా ప్రయత్నం చేస్తుంది. అక్కడ ఈమెనొక స్వామీజీ రక్షించి తన ఆశ్రమానికి తీస్కెళతాడు. ఆయన అభ్యుదయ భావాలు, విధవ స్త్రీల పునర్వివాహం కోసం ఆయన చేసే కృషి చూసి, ఆమె ప్రభావితమై చదువుకుంటూ, ఆయన కార్యక్రమాల్లో సేవల్లో చురుగ్గా పాల్గొంటుంది. స్వామీజీ ప్రవచనాలతో ప్రబావితుడైన ఒక యువకుడు లక్ష్మిని వివాహం చేసుకోవడానికి ముందుకొస్తాడు. కుటుంబ వ్యతిరేకత ఉన్నా ఇద్దరూ పెళ్ళి చేసుకుని స్వమీజీ నిర్వహించే అభ్యుదయ కార్యక్రమాల్లో భాగంగా సమాజ సేవలో మునిగి, తమ ఆశయ సాధనలో తృప్తిగా జీవితం గడుపుతారు. అలా ఒక మూఢాచారాల్లో మురుగుతున్న కుటుంబ వాతావరణంలో సమాజానికి పనికిరాకుండా పోయిన కాలిబహు అదే సమాజోద్ధరణకి కృషి చేయడానికి ఎలా పనికొస్తుందో చూపిస్తుంది. మిగిలిన నవలల్లోని కధాంశాలు కూడా సమకాలీన సమాజానికి అద్దం పడుతూ, చక్కటి పరిష్కారాలను సూచించేవే.



