అణిచివేతల నుండి
పుడుతుంది అగ్నిశిఖరం...
విషాదగాథల నుండి
పుడుతుంది విప్లవశంఖం...
చీకటిలో వేసి
చిత్రహింసలకు గురిచేస్తే
పిల్లి పిల్లైనా పులియై
పీకలు నులిమేస్తుంది
రక్కుతుంది రక్తాన్ని త్రాగుతుంది
భయం గుప్పెట్లో బ్రతుకుట
బానిసత్వమే కదా...!
ఎదురు తిరగడం...
తిరుగుబాటు చేయడం...
బెదిరించే వారి గుండెల్లో
నిదురించడం...
నిప్పులు కురిపించడం...
నిత్యకృత్యమైతేనే కదా...
నిర్భయంగా నీవు జీవిస్తేనే కదా..
నీ జన్మకు ఓ అర్థం పరమార్థం...
కాకి పుడుతుంది
కావు కావు మంటుంది...
కోకిల పుడుతుంది
కుహూ కుహూ అంటుంది...
అడవిలో పులి పుడుతుంది
దొరికిన జంతువుల
రక్తాన్ని రోజూ రుచిచూస్తుంది...
పాము
పుడుతుంది...
పగపడుతుంది...
బుసలు కొడుతుంది...
చాటుమాటుగా కాటు వేస్తుంది...
నక్క పుడుతుంది...
నమ్మిన వారిని నట్టేట ముంచుతుంది...
కుక్క పుడుతుంది ఇంత కూడెడితే
కొండంత విశ్వాసాన్ని చూపుతుంది...
ప్రాణాలను సైతం త్యాగం చేస్తుంది.
ఇది బలహీనులను వేధించే
గూండాలకు గట్టి "గుణపాఠం"...
ఇది నిస్సహాయులను హింసించే
నికృష్టుల పాలిట "నిప్పుల ఖడ్గం"...



