ఔరా ! ఔరా ! ఇది
ఎంత వింత విచిత్రం..!
వచ్చింది ఘోరమైన విపత్తు..!
వచ్చిపడింది తలపై
పిడుగులాంటి పెనుప్రమాదం..!
అయ్యో ! అయ్యో !
రక్షించే నాధుడే లేడే..?
తప్పించుకునే దారేలేదే..?
చావే శరణ్యమా? లేదు లేదు...!
కళ్ళముందరే కొన్ని క్షణాల్లో
ఏదో మాయ? ఏదో ఇంద్రజాలం?
భయపడకు...ధైర్యంగా ఉండు..!
నేనున్నా చూస్తున్నా వస్తున్నా అన్నట్టు...
ఏదో అతీంద్రియ శక్తి ఆదుకున్నట్టు...
లోతైన లోయలో పడి పైకిలేచినట్టు...
పులి నోటికి చిక్కి తప్పించుకున్నట్టు...
మృత్యువు కౌగిట్లో చిక్కుకొని
ముక్కలు ముక్కలై పోవలసిన
కన్నుమూసి కైలాసానికెళ్ళవలసిన
"పాపం ఆ కుక్కపిల్ల" రైలు పట్టాల
మధ్య చిక్కుకొని కొన్ని క్షణాలు
ప్రత్యక్ష నరకాన్ని అనుభవించి...
ఎలా...బ్రతికి బట్టకట్టిందో...
పునర్జన్మ నిచ్చిన ఆ పరమాత్మకే ఎరుక...
ఓ విధాతా ! ఓ పరమాత్మా !
ఔను అగ్నిపరీక్షలు పెట్టేది మీరే...
సమస్యల సమాధిలోకి నెట్టేది మీరే...
ఆ సమాధి నుండి పైకి లేపేది మీరే...
గండాలనుండి సుడిగుండాలనుండి
రక్షించేది మీరే తప్పుచేస్తే శిక్షించేది మీరే...
ఆపదల నుండి ఆదుకునేది
మీ "అమృత అదృశ్య అభయహస్తమే"...
ఔను శివునిఆజ్ఞలేక చీమకైనాలేదంటారు
ఈ నేలపై పుట్టేహక్కు...కుట్టే హక్కు...
అందుకే ఓ పరమాత్మా మీరే మాకు దిక్కు...



