Facebook Twitter
రాళ్ళలో రత్నాలు మట్టిలో మాణిక్యాలు

వయసొచ్చిన

పిల్లలను తిట్టరాదు

కొట్టరాదు భయపెట్టరాదు

వెటకారంగా వ్యంగంగా

ఎగతాళిగా వెకిలిగా పిలవరాదు

నలుగురిలో తగ్గించి మాట్లాడరాదు

ఉలిక్కిపడేలా ఉక్కిరి బిక్కిరయ్యేలా

ఊపిరి ఆగిపోయేలా దండించరాదు

నీవు వెర్రి వెంగళప్పవు వట్టి శుంఠవు

తుమ్మ మొద్దువంటూ శపించరాదు

అదిరిపోయేలా బెదిరిపోయేలా

ఆలోచనలు చెదిరిపోయేలా

గజగజ వణికేలా గద్దించరాదు

దీనంగా దిక్కులుచూసేలా

కుమిలిపోయేలా కృంగిపోయేలా

హెచ్చరికలు జారీచేయరాదు

ప్రేమతో పలకరించాలి

ముద్దుమురిపాలు పంచాలి

బుజ్జగించాలి బుద్దిచెప్పాలి

చిరునవ్వుతో దగ్గరకు తీసుకోవాలి

భుజం తట్టాలి ముందుకు నెట్టాలి

నూరినూరి క్తత్తిలా పదును పెట్టాలి

నీతిని, నిజాయితీని, నిస్వార్థాన్ని

మధురమైన మానవీయ విలువలల్ని

ఉక్కు సంకల్పాన్ని నూరిపోసి

అన్ని ఆయుధాలనందించి,ఆశీర్వదించి

వీరతిలకం దిద్ది యుద్దానికి సిద్ధంచేస్తే చాలు

ప్రపంచ రికార్డులను బద్దలు చేస్తారు

వేడినెత్తురు సలసల పొంగే

ఆ యువకిశోరాలు,ఆ అగ్గిరవ్వలు

దూకమంటే అగ్నిగుండంలో దూకేస్తారు

ఎక్కమంటే ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కేస్తారు

దాటమంటే సప్తసముద్రాలను దాటేస్తారు

రాకెట్లలా రామబాణాల్లా దూసుకుపోతారు

రాళ్ళలో రత్నాలై,మట్టిలోమాణిక్యాలై

రాజ్యాల నేలే రాజులౌతారు

దేశాలనేలే మహానేతలౌతారు

అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తారు

కని,కలలెన్నోకని,పెంచిన అమ్మానాన్నలకు 

జ్ఞానభిక్ష పెట్టిన ఆ గురుదేవుళ్ళకు

బంగరు తల్లి భరతమాతకు

అఖండ కీర్తిని ఆర్జించిపెడతారు

ముందు తరాలకు ఆదర్శమూర్తులౌతారు

చరిత్రలో చిరంజీవులుగా మిగిలి పోతారు