మీ తాత ముత్తాతల తరం నుండి
మీరు బలహీనులే గాని బానిసలు కాదు
మీరు పిడుగులే గాని పిరికిపందలు కాదు
మీరు కూలీలే గాని కాపలా కుక్కలు కాదు
మీరు మనుషులే గాని మరబొమ్మలు కాదు
కానీ ఉరుములల్లా ఉరిమి మెరుపుల్లా మెరిసి
ఉప్పెనలై ఎగిసి ఉద్యమాలకు ఊపిరిపోసి
మనుధర్మశాస్త్రాన్ని మంటల్లో కాల్చి, ప్రతిదీ
ప్రశ్నించి...ప్రశ్నించి పరిశోధించి...పరిశోధించి
ప్రతిఘటించి...ప్రతిఘటించి పోరాడి...పోరాడి
ఉషోదయకిరణాలను మీ బ్రతుకుల్లో నింపి
కడకు ఆ కులసర్పం కాటుకే బలై,కన్నీళ్లతో
ఆరని శోకంతో తీరని ఆశలతో తరలి వెళ్లిన
మీ తల్లిదండ్రుల తరం ముగిసి పోయింది
ఆ ఊరిపొలిమేరల్లో...ఆ పూరిగుడిసెల్లో.....
అట్టి పూరిగుడిసెల్లో పుట్టిన పులులే మీరు
ఔను అంబేద్కర్ త్యాగం మేఘమై
ఉద్యోగం వరమై ఊరిమధ్యలో మీరూడిపడ్డారు
ఓ దళిత బిడ్డలారా! ఇక ఈ తరం మీది
అంతా మీ ఊహల్లోనే అంతా మీ ఊపిరిలోనే ఉంది
అంతా మీ చేతుల్లోనే ఉంది అంతా మీ చేతల్లోనే వుంది
అంతా మీరు చేసే ఉద్యమాల్లోనే ఉంది గుర్తుంచుకోండి !



