ఓ ఆశబోతు...మనిషీ...
ఓ అమాయకపు మనిషీ...
నీవు చేసే యుద్ధం చూసి
అదిగో అద్దం నవ్వుతోంది
నేడు అద్దంలో అందమైన
నీ ప్రతిబింబం అతిసుందరమే...
రేపు పగిలితే అసహ్యమే అస్తవ్యస్తమే...
కత్తిపట్టిన వాడు
ఆ కత్తితోనే కనుమూయాలని
పవిత్ర గ్రంథం బైబిల్ ప్రబోధిస్తున్నది
బాంబులు విసిరానని...
బంకర్లను...శత్రుసైనిక
స్థావరాలను ధ్వంసం చేశానని...
అమాయకపు ప్రజలనెందరినో
ఖతం చేశానని...
కాటికి పంపానని...
వీర్రవీగుతున్నావే...
వికటాట్టహాసం చేస్తున్నావే...
రోషంతో మీసం రువ్వుతున్నావే...
ఓ మనిషి..!
నీవు యుద్ధభేరి మ్రోగిస్తే
యుద్దంలో విజయం సాధిస్తే
నీవు వీరుడివని...శూరుడివని...
గజమాలలతో పూలరథంలో ఊరేగిస్తారు
కానీ నీచేతుల కంటిన
నీ రక్తపుచుక్కల ఆర్తనాదమొక్కటే...
రేపు నీవు
రిక్తహస్తాలతో సమాధికి చేరుతావని...
చరిత్రలో పుటల్లో నీవు
నరహంతకుడిగా మిగిలిపోతావని...
ఓ మనిషి..!
ఓ యుద్ద పిపాసి..!
మీ ముందు విజయలక్ష్మి ఉండొచ్చు
కానీ నీ వెనకాలే
ఒక మృత్యువు ఉందన్నది పచ్చినిజం
ఓ మనిషి..!
ఓ యుద్ద పిపాసి..!
ఎందుకు నీకింత ద్వేషభావం..?
ఎందుకు ఈ పగా ప్రతీకారాలు..?
ఇంకెంత కాలం
యుద్ధాల పేర బలహీనులపై
ఈ దారుణ మారణ హోమాలు..?
ఓ యుద్ద పిపాసి..!
ప్రజల రక్తం పీల్చే ఓ పిశాచి..!
ఓ మతిలేని మనిషి..! మరువకు
నీవు ఈ భూగోళాన్ని ఆక్రమించుకున్నా
రేపు నీకు దక్కేది "ఆరుఅడుగులే"నని.



