అన్నా..! ఓ ఓటరన్నా..!
ఓ పచ్చినిజం చెబుతా విను
శ్రీ "ఆంజనేయుడికి" తన శక్తి
తనకు తెలియదన్నట్లు...
నీకున్న నీ ఓటుకున్న
ఆ "అఖండమైన శక్తి"
నీకు సైతం తెలియదాయె...
నీ చేతిలో
ఉంది ఓటు కాదు
అది ఒక త్రిశూలం...
అది ఒక రామబాణం...
అది ఒక వజ్రాయుధం...
అది ఒక పదునైన కరవాలం...
ఔను నీది ఏ దైవ స్వరూపమో ఏమో...
నీది ఏ దేవతా శక్తి ప్రతిరూపమో ఏమో...
మదించిన మాయమాటల
"మహిషాసురులను" వధించడానికి...
కామపిశాచులైన రాక్షస "రావణాసురుల"
పదితలలు తెగ నరకడానికి...
నమ్మించి నట్టేటముంచే నాయక
"నరకాసురులను" మట్టు పెట్టడానికి...
గుర్తుంచుకునే "గుణపాఠం" నేర్పడానికి...
నీకు సైతం
ఎన్నో అతీంద్రియ శక్తులున్నాయి
అదృశ్యంగాఎన్నో చేతులున్నాయి
ఆచేతుల్లో ఎన్నో ఆయుధాలున్నాయి
రేపు నీవు ఎవరికి
అమృతాన్ని పంచెదవో..?
ఎవరిపై విషం చిమ్మెదవో..?
ఎవరికి ఎరుక..? నీ చేతుల్లో
అదృశ్యంగా ఉన్న ఆయుధాలకు తప్ప
రేపు నీవిచ్చు ఆ తిరుగులేని తీర్పు...
తెచ్చేను దేశంలో విప్లవాత్మకమైన మార్పు



