Facebook Twitter
పువ్వుగా నేనెందుకు పుట్టాలి..?

ఓ ప్రియా..!
ఓ నా ప్రియా..!
నీవే నా ప్రాణం...
నీవే నా రాణివి...
నీవే నా దేవతవి...
నీకు తోడునీడైఉంట...
నా మాట నమ్మమంట...
నీతోనే నా జీవితమంట..
చివరకంట చితివరకంట...
నేనొక తుమ్మెదంట...నీవు...
నాకోసం పుట్టిన పువ్వువంట..

చలాకీగున్నావ్......చామంతిలా
మత్తెక్కిస్తున్నావ్....మల్లెపువ్వులా
భలేగున్నావ్..........బంతిపువ్వులా
గుభాళిస్తున్నావ్.....గులాబీ పువ్వులా
ముద్దొస్తున్నావ్.......ముద్ద మందారంలా

అంటూ నీ "పువ్వుపురాణం" వింటూ
గాలిపటాన్నై...గాలిలో తేలిపోయా...
విహంగాన్నై....వినువీధుల్లో విహరించా...
ఉయ్యాలలూగా....ఊహల్లో ఊరేగా.....

మనకు పెళ్ళి జరిగిపోయినట్టు...
మనం హనీమూన్ ట్రిప్ లో ఉన్నట్టు
స్వర్గసీమలో మునిగి తేలుతున్నట్టు...
తియ్యని కమ్మని కలలెన్నో కన్నా...

కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా
జరిగే వేడుక కళ్ళారా చూడమ్మా
ఎన్నో నోములే గతమందు నోచిఉంటా
నీకే భార్యనై ప్రతి జన్మనందు ఉంటా
నడిచే దైవమా...నీ పాదధూళులే...
పసుపు కుంకుమలు నాకు...అంటూ కమ్మని ప్రేమపాటలెన్నో పాడుకున్నా...

కానీ ఆ తుంటరి తుమ్మెద
మరో పువ్వు మీద వాలగానే...
ఒక్కసారి ఉలిక్కిపడ్డా...నిన్న
పక్కమీద పక్కుమని నవ్విన నాకు
కడుపు రగిలే కన్నీటి నిజం తెలిసింది

ఒక పువ్వు...
గుడిని చేరుతుందని...
ఒక పువ్వు...
జవరాలి జడను చేరుతుందని...
ఒక పువ్వు ...
ఒక రోజు జన్మించి...
ఒక రోజు వికసించి...
ఒక రోజు పరిమళించి...
ఒక రోజు కాముని విష
కౌగిలిలో నలిగిపోయి వాడిపోయి
వీధిలోకి విసిరి వేయబడుతుందని...
అందుకే ఓ పరమాత్మా...
వద్దు వద్దు..! నాకీ ఈ పువ్వు జన్మ..!!