మొన్నపచ్చని పల్లెమట్టిని చీల్చుకొని పుట్టిన చిరువిత్తనమే మొక్కైమొలిచి
నిన్న మాటలకందని మర్రి వృక్షంగా విస్తరించి నేడు నేలొకొరిగి
చూపుల కందక
మాయమైపోయింది
గూడుచెదిరి గుండెపగిలి
పాపం పక్షులెన్నో
విలవిలలాడుతున్నాయి
విలపిస్తున్నాయి
దానికి చిరునామే
కులమతాలకతీతంగా
కాలే కడుపులతో
కట్టు బట్టలతో
నమ్మి వచ్చిన ఎందరినో
ఆప్యాయంగా
ఆలింగనం చేసుకొని
ఆపై ఇంటికి ఆహ్వానించి
ఆకలి తీర్చి ఆశీర్వదించి
కోరిన అవకాశాలనందించి
కొత్త నటీనటులెందరినో
కోటీశ్వరులను చేసి
చిన్న సినిమా నిర్మాతలకు
కొండంత అండగా నిలిచి
చిత్రపరిశ్రమలో సింహంలా
వుంటూ ఊహికందని ఎన్నో
ఉన్నత శిఖరాలను అధిరోహించి
ఎవరికీ తల వంచక, దించక
హక్కులకై పులిలా పోరాడి పోరాడి
ఆత్మగౌరవంతో తలెత్తుకొని తిరిగి
తెల్లని పావురంలా బ్రతికి
ఆపదలో వున్న అందరికి
"నేనున్నానన్న" భరోసానిచ్చి
అభయహస్తాన్నందించి
దారితెన్ను
ఎరుగని బహుదూరపు
బాటసారులెందరికో
బ్రతుకు దారిచూపించి
బాక్సాఫీసు రికార్డుల్ని
బద్దలు కొట్టే
ఆణిముత్యాల్లాంటి
చిత్రాలెన్నో తెరకెక్కించి
గిన్నీస్ బుక్ లో
స్థానాన్ని సంపాదించి
అందరివాడై
ఆపద్భాంధవుడై
ప్రతివారి గుండెగుడిలో
ఒక ఆరాధ్య దైవమై వెలిసిన
ఒక ఆరని జ్యోతిగా వెలిగిన
ఒక చెరగని తీపి
జ్ఞాపకమై మిగిలిన
ప్రేమమూర్తి
పేదల పెన్నిధి
దర్మదాత
ధన్యజీవి
"దర్శక రత్న"
దాసరిగారి
ఆత్మశాంతికై
అర్పించే అక్షర సుమాంజలి
