Facebook Twitter
100 గ్రాముల పిడుగు...?

జీవితమంటే..?
ఒక ఆశల ఆరాటమే..!
నిరంతర పోరాటమే...!
భారతీయ క్రీడాకారిణి
ప్రముఖ రెజ్లర్ వినేశ్ ఫొగాటే...
క్రీడా జీవితం
ఊహకందని....మలుపుల
మానని గాయాలమయం...
అడుగడుగునా గండాలే...
సుఖదుఃఖాల సుడిగుండాలే...

నాడు ఢిల్లీలో మదపుటేనుగులైన
దోషులతో భీకరమైన పోరు...
లైంగిక వేధింపులతో మానసిక క్షోభ...

నిన్న ఒలింపిక్స్ లో రెజ్లింగ్ లో
ప్రత్యర్ధులను మట్టి కరిపించి ఫైనల్ కు
చేరి గోల్డ్ మెడల్ ఖాయమనుకుని...

నింగిలో గర్వంగా రెపరెపలాడే
త్రివర్ణ పతాకాన్ని తిలకిస్తూ...
భారతజాతి యావత్తు గర్వించేలా
జాతీయ గీతం ఆలపిస్తుండగా...
బంగారు పతకాన్ని అందుకొని...
గుండెలకు హత్తుకుని...ముద్దాడి
మురిసిపోవాలని కలలెన్నో కంటూ...

కళ్ళు తెరిచే సరికి 100 గ్రాముల
అనర్హత వేటు పడి పాపం గొడ్డలితో
నరికిన చెట్టులా కుప్పకూలిపోయిందే...

2016 రియోలో కాలికి గాయం...
2020 టోక్యోలో
400 గ్రాముల పాముకాటు...
2024 పారిస్ ఒలింపిక్స్ లో
100 గ్రాముల పిడుగుపాటు...

అయ్యో ఓ దైవమా..!
ఏమిటీ వింత విచిత్రం విషాదం..?
ఇదెంతటి ఘోరం..?
ఏమిటి ఆమె చేసిన నేరం..?
140 కోట్ల భారతీయులు
కన్న కలలన్నీ కల్లలాయెనే...
ఆశలన్నీ అడియాశలయెనే...
అయ్యో ఓ దైవమా..!
వినేశ్ ఫొగాటే కి ఇది విధి లిఖితమా..?
విదేశీ స్వదేశీ కుట్రల ప్రతి ఫలితమా..?