Facebook Twitter
అస్తమించని అక్షరసూర్యుడు శ్రీశ్రీ

మహాకవి శ్రీశ్రీ అంటే...ఎవరు?

తెలుగు సాహితీ ప్రపంచంలో

అస్తమించని సూర్యుడంటే ఎవరు?

పేదల పక్షపాతి...ఆశావాది... 

హేతువాది...సమతావాది...

ధైర్యసాహసాలకు ప్రతీక ఎవరు?. 

సమాజంలోని అసమానతలను

అణిచివేతలను అన్యాయాలను

అక్రమాలను ప్రశ్నించిందెవరు ?

అగ్రవర్ణ భూస్వాములనెదిరించిందెవరు?

వెన్నుచూపని వెనుకాడని వ్యక్తిత్వమెవరిది?..

తన కవితలతో పీడిత తాడిత 

బడుగు బలహీనవర్గాల అభ్యున్నతిని 

కార్మిక శ్రామిక కర్షకుల 

శ్రేయస్సును కాంక్షించిందెవరు? 

తన కవిత్వంతో చిమ్మచీకటి 

కమ్ముకున్న నిరుపేదల బ్రతుకుల్లో

వెన్నెల వెలుగులు నింపాలన్న 

అంతులేని ‌తపన తాపత్రయమెవరికి?

కార్మికుల హక్కులను కాలరాసే 

యజమానులపై నిరసనల

నిప్పులు కురిపించిందెవరు?

వారి కళ్ళు తెరిపించిందెవరు?

అడవిబిడ్డలకు ఆత్మబంధువెవరు?

వారి సిద్ధాంతాలకు మద్దతిచ్చిన 

మహనీయుడెవరు?

పెట్టుబడిదారుల అహంకారాన్ని

కలంతో కన్నెర్రచేసి ప్రశ్నించిందెవరు?

అనాదిగా బడుగుజీవుల బ్రతుకుల్లో

అలముకొన్న అంధకారాన్ని 

తన కవితా కరవాలంతో చీల్చి 

వెన్నెలవెలుగుల్ని నింపిందెవరు? 

ఎవరు ?  ఎవరు ? ఇంకెవరు ?

వినువీధిలో ధృవతారగా వెలిగే

విప్లవకవి మరణంలేని మహాకవి శ్రీశ్రీనే...

ఆ అమరజీవికిదే నా అక్షర నీరాజనం...