Facebook Twitter
మీ భక్తులు కోరేదొక్కటే...

కోరిన కోర్కెలు తీర్చే ఓ కోదండ రామా !

మీ ఈ భక్తులు మీకు మొక్కి మిమ్మును కోరేదొక్కటే...

నాడు రామబాణమెక్కుపెట్టి వాలిని వధించినట్లు

రావణాసురుని,పదితలలు నరికినట్లు

మాయలేడిలాగ,కంటికి కనిపించక,

నక్కినక్కి తిరిగే ఈ కరోనా రక్కసిని,

ఈ మాయదారి మహమ్మారిని,

తక్షణమే వేటాడి,తలనరికి అయోధ్యలో

కోటగుమ్మానికి వ్రేలాడదీసే శక్తిని,మాకివ్వుస్వామీ

 

దుష్టశిక్షణ శిష్టరక్షణ చేసే ఓ శ్రీకృష్ణా !

మీ ఈ భక్తులు మీకు మొక్కి మిమ్మును కోరేదొక్కటే...

కురుక్షేత్రంలో మానసికంగా కృంగిపోయి

అస్త్రసన్యాసం చేసిన అర్జునుడికి గీతను బోధించి 

చక్రంతో ఆ శిశుపాలుని శిరస్సును ఛేదించినట్లు

కంటికి కనిపించక,నక్కినక్కితిరిగే 

ఈ కరోనారక్కసి,ఈ మాయదారి మహమ్మారి 

శిరస్సును చేధించి,చిత్రవధ చేసే శక్తిని,మాకివ్వుస్వామీ...

 

ఏడుకొండలవాడా! ఓ వెంకటేశ్వరా !

మీ ఈ భక్తులు మీకు మొక్కి మిమ్మును కోరేదొక్కటే...

ఏడుకొండలు ఎక్కలేక ఏం చేయాలో దిక్కుతోచక

మిమ్మల్ని దర్శించుకునే దారిలేక

128 సంవత్సరాల తర్వాత గుడికి తాళాలేశానని

విర్రవీగుతూ మమ్మును వెక్కిరిస్తూ గబ్బిలంలా

ఆ ఏడుకొండల్లో కంటికి కనిపించక,

నక్కినక్కి తిరిగే ఈ కరోనా రక్కసికి,

ఈ మాయదారి మహమ్మారికి,గుండు చేసి,

కొండదేవతకు బలినిచ్చే శక్తిని,మాకివ్వుస్వామీ.

 

యూదులరాజా ! ఓ క్రీస్తురక్షకా!

మీ ఈ భక్తులు మీకు మొక్కి మిమ్మును కోరేదొక్కటే...

ఎందరో కుంటి, గుడ్డి,చెవిటి,మూగ, మూర్చ,

కుష్టు, పక్షవాత రోగులకు స్వస్థత చేకూర్చి

పీడించే దెయ్యాలను తరిమి కొట్టినట్లుగా

కంటికి నిపించక, నక్కినక్కి తిరిగే

ఈ కరోనా రక్కసిని,ఈ మాయదారి

మహమ్మారిని కలువరిగిరి సాక్షిగా 

శిలువ వేసి,సమాధి చేసే శక్తిని,మాకివ్వు ప్రభూ....

 

అందరిని చల్లగా చూసే ఓ అల్లా! 

మీ ఈ భక్తులు మీకు మొక్కి మిమ్మును కోరేదొక్కటే...

తాళలిబాన్ ఉన్మాదిలా ఐయస్ఐ ఉగ్రవాదిలా

ఉగ్రరూపందాల్చి అగ్రరాజ్యాలనే అల్లకల్లోలం చేస్తున్న

విశ్వంపై విరుచుకుపడి,విలయతాండవం చేస్తున్న

కంటికి కనిపించక,నక్కినక్కితిరిగే ఈ కరోనా రక్కసిని

ఈ మాయదారి మహమ్మారిని, రాళ్ళతో కొట్టి

మక్కాసాక్షిగా మట్టుపెట్టి,మాయంచేసే శక్తిని,మాకివ్వుదేవా..

 

ప్రత్యక్ష దైవమా! ఓ ప్రసన్నాంజనేయా !

మీ ఈ భక్తులు మీకు మొక్కి మిమ్మును కోరేదొక్కటే...

మీరు నాడు లంకను దహనం చేసి

ఆ సీతమ్మ తల్లిని రక్షించినట్లు,

కంటికి కనిపించక,నక్కినక్కి తిరిగే 

ఈ కరోనారక్కసిని,ఈ మాయదారి

మహమ్మారిని, కాల్చి బూడిదచేసి

కాశిలో అస్థికలు కలిపేసే శక్తిని,మాకివ్వు స్వామీ...

 

విఘ్నాలు తొలగించే ఓ విఘ్నేశ్వరా!

మీ ఈ భక్తులు మీకు మొక్కి మిమ్మును కోరేదొక్కటే...

ఈ గండం నుంచి అందరిని గట్టెక్కించమని

కంటికి కనిపించక,నక్కినక్కి తిరిగే 

ఈ కరోనా రక్కసిని, ఈ మాయదారి

మహమ్మారిని,అధఃపాతాళానికి

అణగద్రొక్కి,అంతంచేసే శక్తిని,మాకివ్వు స్వామీ....