గురువు గోష్టిపూర్ణులు
రహస్యంగా చెవిలో చెప్పిన
ఓం నమో నారాయణాయః అన్న
అష్టాక్షరీ తిరుమంత్రాన్ని గుడిగోపురమెక్కి
ఊరంతా వినిపించి విన్నవారంతా
స్వర్గానికి వెళ్తే వాగ్దాన భంగం చేసిన
తాను నరకాని కెళ్ళడానికి సిద్ధమేనని
వెయ్యేళ్ళ నాడే వేదం వెలుగులో సమానత్వాన్ని
సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని ప్రబోధించిన
సమతాముర్తి...శ్రీ రామానుజాచార్యులవారు
తొండూరులో అన్నికులాలవారు
తాగేందుకు ఒక జలాశయాన్ని ఏర్పాటు చేసి
భక్తి జ్ఞానం ముఖ్యం కానీ కులం కాదంటూ
దళితులతో సహపంక్తి భోజనాలు చేసిన
అంటరానివారికి ఆలయ ప్రవేశం...కల్పించిన
సంఘసంస్కర్త... శ్రీ రామానుజాచార్యులవారు
విశిష్టాద్వైత మతప్రచారానికి నియమించిన
12 మంది మహాభక్తులైన ఆళ్వారుల్లో
ఒకరు బ్రాహ్మణుడు ఒకరు మహిళ
10 మంది ఇతరకులాలవారు...నాడే ఆనాడే
సమాజంలోని వర్ణవ్యవస్థ అంటరానితనం వంటి
దురాచారాలపై త్రికరణశుద్ధితో తిరుగుబాటు చేసిన
విశిష్టాద్వైత సిద్దాంతమంటూ విప్లవ శంఖాన్ని
పూరించిన అర్చకుల అగ్రవర్ణాల ఆగ్రహానికి గురైన
సాహసి సమతావాది...శ్రీ రామానుజాచార్యులవారు



