ఆ సరస్వతీదేవి శపించి
బడికి ఒకరోజే వెళ్ళినా
ఆ విధిచిన్నచూపు చూసి
కన్నతండ్రి గుండెజబ్బుతో
13 ఏళ్ళకే మరణించినా
బ్రతుకుబండి లాగుతూ
నటిగా మరాఠి చిత్రసీమలో
ఒక మెరుపులా మెరిసినా
ప్రేమకు పెళ్ళిదూరమైనా
కడకు పాటే ప్రాణంగా హిందీ
నేపథ్య గాయనిగా స్థిరపడిన
స్వరకోకిల...లతా మంగేస్కర్
అది గాత్రమా కాదు కాదు
ఓ అమృతభాండం
అవి గీతాలా కాదు కాదు
కురిసే తేనెల వానలు
గలగలపారే సెలఏరులు
జలజలదూకే జలపాతాలు
కోట్లాదిమంది భారతీయుల
గుండెల్లో కొలువైన గాన గంధర్వ
స్వరశిరోమణి...లతా మంగేస్కర్
20 భాషల్లో 50 వేల పాటలు పాడి
ఆబాలగోపాలాన్ని ఆనంద సాగరంలో
ఓలలాడించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్
రికార్డులో స్థానాన్ని సంపాదించుకున్న
సంగీత సరస్వతి...లతా మంగేస్కర్
పద్మభూషణ్ పద్మవిభూషణ్
భారతరత్న మూడు అత్త్యున్నత
పురస్కారాలందుకున్న
భరతమాత ముద్దు బిడ్డ
సంగీత సామ్రాజ్యానికి మకుటంలేని
మహరాణి...లతా మంగేస్కర్
స్వరమే భగవంతుని వరమంటారు
ఏ గాయకునికైనా ఏ గాయకురాలికైనా
చైనా భారత్ యుద్ధ సమయంలో
దేశభక్తి గీతాన్ని ఆలపించి ప్రధాని నెహ్రూనే
కంటతడి పెట్టించి తన గొంతులో
కోటి వేణువులు దాచుకున్న
కోటిరాగాల కోయిలమ్మ భరతమాత మెడలో
మెరిసే బంగరు ఆభరణం...లతా మంగేస్కర్
ఒకనాడు విషప్రయోగం జరిగి మూడు నెలలు
మృత్యువుతో పోరాడి ఆ మృత్యువునే ఓడించినా
నేడు కరుణలేని కరోనా కాలసర్పం కాటుకు బలై
గగనానికేగిన గానకోకిల...లతా మంగేస్కర్
ఆత్మశాంతికై అశృనయనాలతో అర్పిస్తున్న అక్షరనీరాజనం



