తీవ్రమైన ఒత్తిడికి
తట్టుకోలేని మనో వేదనకు
చెప్పుకోలేని మానసిక క్షోభకు
గురైనవారే ఆత్మహత్య చేసుకోవాలనే
ఒక దారుణమైన తప్పుడు నిర్ణయానికి వస్తారు
ఓడిపోయాను ఓడిపోయాను
అని, పదేపదే తలచుకొని, లోలోపల
కుమిలిపోయే, కృంగిపోయేకంటే
ఒక ప్రయత్నం చేశాను ఓడిపోయాను
మరొక్కసారి ప్రయత్నిస్తే పోయేదేముంది?
చచ్చిసాధించే దేముంది,? అని అనుకునేవారు
ఆత్మహత్య చేసుకోవాలన్న
ఆలోచనకు రారు
తట్టుకోలేని ఒత్తిడికి గురౌతున్నప్పుడు
ఇంటిలో భార్యపిల్లలతోనైనా
దగ్గరి బంధువులతోనైనా
ప్రాణమిత్రులకైనా చెప్పుకుంటే
మదిలో ఉక్కిరి బిక్కిరిచేసే ఆరక రగిలే
అగ్నిజ్వాలల్లాంటి ఆవేదనను,ఆ బాధను
ఒక్కసారైనా ప్రక్కవారితో పంచుకుంటే
ఎంతో కొంత ఉపశమనం కలుగుతుంది
ఒంటరిగా వుండకుండా నలుగురిమధ్య
నవ్వుతూ తిరుగుతూ వుంటే ఇక
ఆత్మహత్యకు పాల్పడే
అవకాశమేది ? చెప్పండి
ఒత్తిడి అన్నది ఒక్కరోజులో
ఒక పిడుగులా
హఠాత్తుగా నెత్తిన పడేది కాదు
ఒత్తిడి అన్నది ఒక్కరోజులో ఒక గుండెనొప్పిలా
గుట్టుచప్పుడు కాకుండా వచ్చేది కాదు
వందడుగుల దూరంలో ఉప్పొంగి
ఒక వరద వస్తూవుంటే చూసి ఒక్కడుగు
ముందుకు దూకి తప్పించు కుంటాము
పదడుగుల దూరంలో ఒక పాము కనిపిస్తే
చంపడానికి కర్రతో సిద్దంగా వుంటాము
అలాగే తీవ్రమైన ఒత్తిడికి
అనవసరమైన ఆందోళనకు గురికాకుండా
ఆత్మహత్యలకు బలికాకుండా వుండాలంటే
చక్కని మార్గమొక్కటే మనశ్శాంతి
కాసింత ప్రశాంతత అవి రెండూ దొరకాలంటే
విహారయాత్రలకైనా వెళ్ళాలి
కడుపుబ్బ నవ్వించే
కామెడీ సినిమాలైనా చూడాలి
ఇష్టమైన ఆటలైనా ఆడాలి
ఆథ్యాత్మికమైన సందేశాలైనా వినాలి
బైబిల్ భగవద్గీత భాగవత
రామాయణ గ్రంథాలైనా చదవాలి
లేదా చిరునవ్వులు చిందిస్తూ
అల్లరిచేసే చిన్నపిల్లలతోనైనా ఆడుకోవాలి
నచ్చిన పాటలైనా పాడుకోవాలి
శ్రావ్యమైన సంగీతమైనా
వింటూ కాలాన్ని గడపాలి
ఇక ఆత్మహత్యలకు
పాల్పడే అవకాశమేది? చెప్పండి.



