దగాపడ్డ ఓ బహుజన బిడ్డలారా!
నిద్రమేల్కొని ఇకనైనా
నిజం తెలుసుకోండి! ఈ
కంప్యూటర్ యుగంలోనైనా
కళ్ళు తెరుచుకోండి!
ఆనాడు....
నాగదేవతలంటూ పుట్టలోని
పాములకు పూజలు చేశారు కానీ
నడివీధిలో నీవారిని నడవనివ్వలేదు
ఆనాడు....
కాలభైరవుడంటూ కనిపించిన
శునకాలకు మొక్కారు కానీ
చెరువుగట్టు మీవారిని చేరనియ్యలేదు
ఆనాడు....
గోమాతలు దేవతలన్నారు
వాటి మలమూత్రాలు
పరమ పవిత్రమన్నారు కానీ
కులగోత్రాలంటూ
మీవారిని కుక్కలకన్నా హీనంగాచూశారు
ఆనాడు....
కోతుల్ని కొండముచ్చుల్ని
గుడ్లగూబల్ని గబ్బిలాలను
గుడిలోనికి ఇచ్చారు కానీ
ఆలయాల్లో నీవారిని అడుగుపెట్టనివ్వలేదు
అట్టి అసమానతలకు అణచివేతలకు
అసలు కారణం అజ్ఞానమా ? కాదు
ఆర్థికంగా చితికి పోవడమా ? కాదు
అందుకు,కారణం"అంటరానితనమే"
అలా ఆరు అక్షరాల శిక్షకు గురై
అగ్రవర్ణాల ఆగ్రహానికి అజ్ఞానానికి
అంధవిశ్వాసాలకు బలై
కులరక్కసి కోరల్లో చిక్కిన
నీ "ముత్తాతలతరం" ముగిసింది
ఊరికి దూరంగా ఉత్తరాన
అందుకే...
దగాపడ్డ ఓ బహుజన బిడ్డలారా!
నిద్రమేల్కొని ఇకనైనా
నిజం తెలుసుకోండి! ఈ
కంప్యూటర్ యుగంలోనైనా
కళ్ళు తెరుచుకోండి!



