Facebook Twitter
ఓ విశ్వాసీ ! ఎక్కడికి నీ పరుగు ?

ఓ విశ్వాసీ !
ఎక్కడికి నీ పరుగు ?
ఎక్కడి వరకు నీ పయనం ?
అక్కడి వరకు...
అంటే ఎక్కడి వరకు ?
కడవరకు కలువరి గిరి వరకు...

పరిశుద్ధుడు...
రక్షకుడు ప్రేమామయుడు...
పరమపావనుడని పిలువబడినా
ఏ పాపం ఎరుగకపోయినా...
రోమా సైనికులచే తిట్టబడిన...
క్రూరంగా కొరడాలతో కొట్టబడిన...
శిరస్సుపై ముళ్ళకిరీటం పెట్టబడిన...
ప్రక్కలో బల్లెంతో చెక్కబడిన...
చిత్రహింసలకు గురిచేయబడిన...
శిలువ వేయబడిన...
గొర్రెపిల్లలా వధింపబడిన...
సమాధి చేయబడిన...

మృత్యువును జయించి
మూడోదినాన తిరిగిలేచిన
నా దైవాన్ని దర్శించేంత వరకు...
కనులారగాంచి తరించేంత వరకు...
ఆ ప్రభువు పరిశుద్దరక్తంతో
నా సకల పాపాలన్నీ
సంపూర్ణంగా కడగబడేంత వరకు...

ఆయన కృప ప్రేమ కరుణ
జాలి శాంతి సమాధానాలు
సదా నాపై కుండపోతగా
కుమ్మరించబడేంత వరకు...

నిత్య సత్యమైన స్వర్గతుల్యమైన
ప్రశాంతకరమైన జీవితాన్ని
నాకు ప్రసాదించేంత వరకు...

ప్రతినిత్యం ఆయన
సన్నిధిలో నిలబడి
పరిశుద్ధ గ్రంథాన్ని పఠించి...
దివారాత్రములు ధ్యానించి...
కన్నీటితో ప్రార్థనచేసి...
రక్షణభాగ్యాన్ని పొందేంత వరకు...

పరలోకరాజ్యంలో ప్రభువు
కుడిపార్శ్వాన కూర్చునేంత వరకు...
ఆగదు ఆగదు నా పరుగు...
ఆగదు ఆగదు నా పయనం...