మీ చేతుల్లో
ఓ విద్యార్థీ ! గుర్తుంచుకో
నీవు నీతి నిజాయితీలేని
నీచకార్యాలకు పాల్పడినా
పరాయిదేశం పోయి ఏ రాయి విసిరినా
సూటిగా తగిలేది పగిలేది ఆవేదనతో
రగిలేది నీ గురువుగారి గుప్పెడుగుండే
తాను నేర్పింది ఒకటి నీవు నేర్చుకున్న దొకటని...
ఓ విద్యార్థీ ! గుర్తుంచుకో
నీవు అవినీతికి పాల్పడినా ప్రేమించిన
అమ్మాయిని మోసం చేసినా
అధిక కట్నాలకోసం కానుకల కోసం
తాళికట్టిన ఆకలిని వేధించినా
వెతలకు గురిచేసినా వ్యధ చెందేది
బరువెక్కేదీ నీ గురువు సుతిమెత్తనిమనసే,
తాను చెప్పింది ఒకటి నీవు చేసింది మరొకటని...
కానీ, ఓ విద్యార్థీ !
నీకు బ్రతుకు దారినిచూపి
విలువైన జీవితపాఠాలెన్నో నేర్పి
తాను నేలపైనున్నా నీవు మాత్రం
వినువీధుల్లో విదేశాలలో
విమానాలలో విహరించాలని
నీవు వున్నస్థితి నుండి
అత్యున్నతశిఖరాలను అధిరోహించాలని
కలలు కనేది ఆ కలలు నిజమమైతే
"దీర్ఘాయువుష్మాన్ భవా" అని నిన్ను దీవించేది నీ గురుదేవుడే
ఉప్పోంగేది ఆ గురువు గుప్పెడు గుండే
మురిసిపోయేది ఆ గురువు మూగమనసే
చెప్పిందే చేశావని ,నేర్పిందే నేర్చుకున్నావని,
నీవు గురువును మించిన శిష్యుడవైపోయావని...



