Facebook Twitter
ఎవరు సృష్టికర్త? ఏమిటీ సృష్టిరహస్యం?

దేవుడు లేడు ,ఎక్కడున్నాడు ?ఎలా వుంటాడు?

వుంటే,అదిగో ఆ చెట్టులా మనకళ్ళకు కనిపించేవాడేగా

కళ్ళకు కనిపించడు మనసు విప్పి మాట్లాడడు కాబట్టే

దేవుడెక్కడని ప్రశ్నించవచ్చు

దేవుడే లేడనే ఒక గట్టి నిర్ణయానికీ రావచ్చు

 

దేవుడున్నాడనే వారిని ఒక్కసారి

కళ్లకు చూపించమని కోరవచ్చు

లేడూ లేడూ అని బల్లగుద్ధి చెప్పవచ్చు

దేవుడున్నాడని ఎవరైనా నిరూపిస్తే

ఆర్జించిన ఆస్తినంతా రాసిస్తామని

ఛాలంజ్ కూడా చేయవచ్చు

అన్నాడో నాస్తికుడైన నిరాశావాది కానీ

 

అది విన్న ఆస్తికుడైన ఆశావాది నాస్తికుడితో

నవ్వుతూ  అసలు "నీకు బుర్రేలేదు" అన్నాడు

"నాకు బుర్రలేదా" అంటూ బిగ్గరగా నవ్వాడు నాస్తికుడు

"ఉంటే చూపించు" అన్నాడు ఆస్తికుడు

కాని ఎలా చూపించాలో అర్థం కాక

బుర్ర గోక్కున్నాడు జుట్టు పీక్కున్నాడు,నాస్తికుడు

 

నిజంగా నీకు బుర్రేఉంటే

పాలల్లో ఉన్న వెన్నను వ్రేలువంచకుండా

కవ్వంతో చిలకుండా వేరుచెయ్?

నిజంగా నీకు బుర్రేఉంటే

సముద్రంలో అలలను ఎగిసిపడకుండా

క్షణం సేపు ఆపుచెయ్ ?

నిజంగా నీకు బుర్రేఉంటే

మిట్టమధ్యాహ్నం భగభగమండే సూర్యున్ని

ఒక్కగంట సేపు కన్నార్పకుండా వీక్షించు?

నిజంగా నీకు బుర్రేఉంటే

వర్షాన్ని కురిపించు, 

వేర్లులేని చెట్లను చూపించు ?

అడవిలోని చెట్లను

ఆచెట్లకున్న ఆకుల్ని

ఆకాశంలోని నక్షత్రాలను

సముద్రతీరాన ఇసుక రేణువుల్ని లెక్కించు ?

అన్నాడు ఆస్తికుడు ఆవేశంతో

ఆప్రశ్నలకి నాస్తికుడి

బుర్రే కాదు భూమి కూడ గిర్రున తిరిగింది

ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేక

బుర్ర గోక్కున్నాడు జుట్టు పీక్కున్నాడు,నాస్తికుడు

 

ఏటేటీ? పాలలోని వెన్నను వేరు చెయ్యాలా ?

సముద్రంలో అలలను ఎగిసిపడకుండా ఆపాలా?

మిట్టమధ్యాహ్నం సూర్యున్ని కన్నార్పకుండా చూడాలా?

వర్షం కురిపించాలా? వేర్లులేని చెట్లను చూపించాలా?

అడవిలోని చెట్లను,ఆచెట్లఆకుల్ని,ఆకాశంలోని నక్షత్రాలను

సముద్రతీరాప ఇసుక రేణువుల్ని లెక్కించాలా?

How is it possible? అంటూ మళ్ళీ

బుర్ర గోక్కున్నాడు జుట్టు పీక్కున్నాడు నాస్తికుడు

 

అందుకే ఓ నాస్తిక మిత్రమా !

సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడన్నది ఎంత సత్యమో

ఆ సృష్టికర్త వున్నాడన్నది కూడా అంతే నిజం

నీవు మృత్యువును, తీగలోని కరెంటును

నీ రెండు కళ్ళతో ఎలా చూడలేవో

నీ రెండు చేతులతో ఎలా తాకలేవో

అలాగే కోటి సూర్యులతో సమానమైన

ఆదైవం నీ ముందు ప్రత్యక్షమైనా నీవు దర్శించుకోలేవు

 

నిజానికి

ఈ విశ్వంలో "కొన్ని,లేవన్నా"ఉన్నట్టే

పగటిపూట కనిపించని నక్షత్రాల్లాగ

"కొన్ని కంటికి కనిపించకపోయినా"

విశ్వమంతా వ్యాపించి వున్నట్లే

కనిపించక వీచే చల్లని గాలిలాగ అన్నాడు ఆస్తికుడు

 

అంతే

"అనంతమైన ఈ సృష్టి" వెనుక

"అఖండమైన ఒక శక్తి" వున్నదన్న

నగ్నసత్యం తెలిసిన ఆనాస్తికుడు

"బుర్రవెలిగి"బుద్దిపెరిగి" ఆస్తికుడైపోయాడు