ఒకరోజు ఓ పేదరాలు ద్రాక్షతోట ప్రక్కగా వెళ్తూ....బాగా పండిన ఆ ద్రాక్షతోటను ఒకచోట నిలబడి ఎగాదిగా చూస్తూ వుంది. అది గమనించిన తోటమాలి అమ్మా! నీకు ద్రాక్షపళ్ళు కావాలా? అని అడిగెను. అందుకామె అయ్యా! కనీసం ఆ రాలిపోయిన ద్రాక్షలు ఇచ్చినా తీసుకుంటానయ్యా అని బదులిచ్చెనట.
అప్పుడు ఆ తోటమాలి....అమ్మా! నీవు వెళ్ళి ఎన్ని ద్రాక్షపళ్ళు కావాలో అంత పెద్ద బుట్ట తెచ్చుకో, ఆ బుట్ట సరిపడా పళ్ళు ఇస్తాను అని చెప్పెనట.
వెంటనే ఆ మామ్మగారు పరుగుపరుగున వెళ్ళి ఒక బుట్ట తీసుకొచ్చి అతని చేతిలో పెట్టెనట.
ఆ తోటమాలి అమ్మా! ద్రాక్షపళ్ళు తీసుకొస్తానుండు అనిచెప్పి తోటలోనికి వెళ్ళెను. తోట బయట ఆ మామ్మ వేయి కళ్ళతో ఎదురుచూస్తుంది కాని ఆ తోటమాలిమాత్రం రాలేదు. చాలాసేపు ఎదురుచూసి ఎదురుచూసి తాను మోసపోయాననుకొని, ఆ తోటమాలిని అనుమానించడం, నిందించడం ఆ తర్వాత ఇక ఓపిక నశించి దూషించడం కూడా మొదలుపెట్టింది.
కొంతసేపయ్యేసరికి ఆ తోటమాలి ఆ గంపనిండా శ్రేష్ఠమైన ద్రాక్ష గెలలతో తిరిగివచ్చి.... అమ్మా! ఆలస్యం అయినందులకు క్షేమించు. ఈ ద్రాక్షతోటను చూసి ఎంతో ఆశపడిన నీకు ఏవో నాలుగు ద్రాక్షపండ్లు ఇచ్చి పంపించుటకు మనసురాక మా తోటలోవున్న శ్రేష్ఠమైన, రుచికరమైన ద్రాక్షపళ్ళు ఏరికోరి తెచ్చేసరికి కొద్దిగా ఆలస్యమయింది ఇవిగోనమ్మా! నువ్వు ఆశించిన ద్రాక్షపళ్ళు అని ఆ తోటమాలి ఆ బుట్టనందిస్తూ వుండగా ఆ మామ్మగారి కళ్ళలోనుండి.... కృతజ్ఞతతో ఒకవైపు అరె! నాకు గంపనిండా ద్రాక్షపళ్ళు ఇవ్వాలని ఆశపడి, ఆ ప్రయత్నంలో ఆలస్యముగా వచ్చిన ఇంత మంచి మనిషిని నేను దూషించితినే అనే బాధతో కన్నీళ్ళు సుడులు తిరుగుతుండగా, ఆ గంపను చంకను బెట్టుకొని కృతజ్ఞతతో అక్కడనుండి వెళ్ళేనట.
నా ప్రియ సహోదరీ, సహోదరుడా! నువ్వు దేవుని సన్నిధికి వచ్చి నీకున్న కష్టాన్ని, నీకున్న నష్టాన్ని, నీకున్న ఆశను, నీకున్న కోరికను చెప్పుకున్నావా? ఆయన ఇచ్చే జవాబు కొరకు వేయి కళ్ళతో ఎదురుచూస్తూ వున్నావా? అయినా నీవు ఆశించిన జవాబు, నీవు కోరుకున్న సమాధానం రాలేదా? నీ సమస్య సమస్యగానే నీ కోరిక కోరికగానే మిగిలిపోయిందా?
అధైర్యపడకు! నీకు సంపూర్ణ జవాబు ఇవ్వాలనే, నీ కన్నీటిని నాట్యముగా మార్చాలనే, నీ నిరాశను, నిస్పృహను తీర్చాలనే ఆశతోనే దేవుడు నీ కొరకు దాచివుంచిన శ్రేష్ఠమైన వరాలను, ఫలాలను ఏరుకొని, కోరుకొని తీసుకొని రాబోతున్నాడు కాబట్టే ఇంత ఆలస్యం అవుతుంది.
చాలీచాలని జవాబులతో అరకొర ఆశీర్వాదాలతో నిన్ను నింపి లేదా వట్టి మాటలతో నచ్చచెప్పి ఖాళీ చేతులతో పంపించేసేవాడు కాదు మన దేవుడు.
మంచి ఉద్యోగం కావాలని, మంచి సంబంధం దొరకాలని, మంచి ఆరోగ్యం పొందాలని, మంచి రోజులు చూడాలని, కష్టాలు తొలగిపోవాలని ఆశించావా? మనం ఊహించిన వాటికన్నా , అడిగిన వాటికన్నా అత్యధికంగా చేయగలిగిన, ఇవ్వగలిగిన శ్రేష్ఠమైన తండ్రి మన తండ్రి.
కనుక నీకు రావలసిన జవాబు ఆలస్యమవుతుందంటే నువ్వు పొందబోయే జవాబు బహు శ్రేష్టమైనదని గ్రహించి విశ్వాసముతో , నిరీక్షణతో , ఓపికతో ఆయన జవాబు కొరకు కనిపెట్టు.
అంతేగాని, అనవసరముగా తొందరపడి విశ్వాసము కోల్పోయి, దేవునికి ఆయన దీవెనకు దూరం కావద్దని ప్రభువు పేరట మనవి చేయుచున్నాను.
"తన సొంతకుమారుని అనుగ్రహించుటకు వెనుకతీయక మన అందరికొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతోపాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు?" (రోమా 8:32) జరుగుతున్న ఆలస్యమునుబట్టి దేవున్ని అనుమానించక విశ్వసించి ఆయన అనుగ్రహించు శ్రేష్ఠమైన జవాబును సరైన సమయములో స్వతంత్రించుకో!
ఈ గొప్ప సంగతులను మీ తోటి విశ్వాసులతో షేర్ చేసి పంచుకో...



