దక్షిణాఫ్రికాలో,తెంబు తెగలో
ఉమాటా జిల్లా, మవెజో గ్రామంలో
గాడ్లా, నోసెకెనిఫాన్నీలకు జన్మించి
దూరవిద్యలో న్యాయకోవిదుడై
లింకన్,లూథర్, గాంధీజీల స్పూర్తితో
వర్ణవివక్షకు బలౌతున్న
అణచివేతకు గురౌతున్న
అమాయకపు దక్షిణాఫ్రికా ప్రజల
సాంఘీక సమానత్వం కోసం
రాజకీయ,హక్కులకోసం
స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకోసం
27 ఏళ్ళు రోబెన్ దీవిలో ఖైదీయై,
జైలునుండే సాయుధ పోరాటం సాగించిన
విజయం సాధించిన విప్లవ వీరుడు,విశ్వనేత
"అస్తమించని నల్లని సూరీడు" నెల్సన్ మండేలా
అహింస సత్యం ధర్మం ఆయుధాలతో
గాంధేయ మార్గంలో పయనించిన
అనుకున్న ఆశయాలను సాధించిన
నల్ల శ్వేత జాతీయుల నడుమ
శాంతియుత సహజీవనంకోసం జీవితాన్నే
త్యాగం చేసిన స్వాతంత్ర్య సమరయోధుడు
"శ్వేతజాతి సింహస్వప్నం" నెల్సన్ మండేలా
దక్షిణాఫ్రికా గాంధీగా కీర్తి గడించిన
మహాఘనుడు త్యాగధనుడు,ధన్యజీవి
ప్రత్యర్థులచే ప్రశంసలను,లెక్కకుమించి
పురస్కారాలనందుకొన్న పుణ్యమూర్తి
భారతరత్న నోబుల్ శాంతిబహుమతి గ్రహీత
ఒకే ఒక్కడు దక్షిణాఫ్రికా దేశాధ్యక్షుడు
"నల్లజాతి ఆశాజ్యోతి"నెల్సన్ రోలీహ్లాహ్లా మండేలా



