Facebook Twitter
ఓటరన్న ఒక త్రినేత్రుడు..!

అన్నా..! ఓ ఓటరన్నా..! రేపు నీవు
ఎవరి తోకలు కోసేస్తావో..?
ఎవరి పీకలు పిసికేస్తావో..?
ఎవరికి గుణపాఠం నేర్పిస్తావో...?
ఎవరి గుండెలు బ్రద్దలు చేస్తావో...?
ఎవరికి ఎరుక..? నీకు తప్ప నీ
చేతిలో ఉన్న...ఆ త్రిశూలానికి తప్ప..?

అన్నా..! ఓ ఓటరన్నా..! రేపు నీవు
ఎవరిని భారీమెజారిటీతో గెలిపిస్తావో..?
ఎవరి డిపాజిట్లు గళ్ళంతు చేస్తావో..?
ఎవరిని అధికారసింహాసనం ఎక్కిస్తావో..?
ఎవరిని రాజకీయంగా సమాధి చేస్తావో..?
ఎవరికి ఎరుక..? నీకు తప్ప నీ
చేతిలో ఉన్న...ఆ త్రిశూలానికి తప్ప..?

అన్నా..! ఓ ఓటరన్నా..! రేపు నీవు
ఎవరి నెత్తిన గెలుపు కిరీటం పెడతావో..?
ఎవరిని గజమాలతో సత్కరిస్తావో..?
ఎవరిని గండ్రగొడ్డలితో నరికేస్తావో..?
ఎవరికెరుక..? నీకు తప్ప నీ
చేతిలో ఉన్న...ఆ త్రిశూలానికి తప్ప..?

అన్నా..! ఓ ఓటరన్నా..! రేపు నీవు
ఎవరిని నీళ్ళ ముంచెదవో..?
ఎవరిని పాలముంచెదవో..? మదించిన
మహిషాసురులనెందరిని వధించెదవో..?
ఎవరికెరుక...నీకు తప్ప
నీ చేతిలో ఉన్న...ఆ త్రిశూలానికి తప్ప..?

అన్నా..! ఓ ఓటరన్నా‌..!
అందరి కళ్ళు నీ మీదనే...
అందరి ఆశలు నీ ఓటుపైనే...
అందరి బ్రతుకులు...
అందరి జాతకాలు నిప్పులాంటి...
నిష్పక్షపాతమైన రేపటి నీ తీర్పుపైనే...
ఏ‌ ప్రలోభాలకు....లొంగక ఓటెయ్యాలి...
ప్రజాస్వామ్యానికి...ప్రాణం పొయ్యాలి...