ఏమన్నాయి ? ఏమన్నాయి ?
గాజా స్ట్రిప్ లో
స్కూల్ భవనాలను...
ఆసుపత్రులను కవచాలుగా...
మార్చుకుని రాకెట్లు ప్రయోగిస్తున్న
మారణహోమం సృష్టిస్తున్న
హమాస్ మిలిటెంట్లను మట్టుపెట్టాలని
వారు దాక్కున్న భూగర్భ సొరంగాలనే "ప్రపంచంలో అతిపెద్ద సమాధులుగా" మార్చాలని గాజాపై యుద్ధభేరి మ్రోగించి
రాత్రింబవళ్ళు ఇజ్రాయెల్ సైనికులు
కురిపించే...ఆ బాంబులమోతలు"...
ఏమున్నది
ఏమున్నది గర్వకారణం..?
ఎటుచూసినా...చీకటి
సొరంగాలలో చితికిన బ్రతుకులేనని...
రాత్రింబవళ్ళు...
రాకెట్ దాడులేనని బాంబుల మోతలేనని...
తిరగబడ్డ పాలస్తీనా ప్రజల తలరాతలేనని..
ఏమున్నది
ఏమున్నది గర్వకారణం..?
ఎటు చూసినా....
ఆసుపత్రుల నిండా...
రక్తపు మడుగులో గిలగిలలాడే
చిన్నపిల్లల...మహిళల...
వృద్దులైన క్షతగాత్రుల హాహాకారాలేనని...
దట్టమైన పొగకు
ఊపిరాడక ఉక్కిరిబిక్కిరౌతూ
మూటా ముళ్ళె సర్దుకొని...
దిక్కుతోచక ప్రాణభయంతో
పరుగులు తీసే పాలస్తీనా ప్రజలేనని...
ఏమున్నది
ఏమున్నది గర్వకారణం..?
ఎటు చూసినా....
ఆకలి కేకలేనని...ఆకాశాన్నంటే
ఆక్రందనలేనని...అరణ్య రోదనలేనని...
పగలు రాత్రి బాంబుల వర్షమేనని...
కటిక చీకటి...గాఢాంధకారమేనని...
క్షిపణి దాడులు...ప్రతిదాడులేనని...
కళ్ళముందరే ఏరులైపారేది
అమాయకపు ప్రజల రక్తమేనని..
ఏమున్నది
ఏమున్నది గర్వకారణం..?
ఎటు చూసినా...
శరీరాలు ఛిద్రమై గాలిలో
కలిసిపోయిన పౌరుల ప్రాణాలేనని..
కొనఊపిరితో కొట్టుమిట్టాడుతూ
ఆపన్నుల కోసం ఆశతో
ఎదురు చూస్తున్న అభాగ్యులేనని...?
ఎటు చూసినా...
వేలాది మంది క్షతగాత్రులకు
ప్రాథమిక చికిత్సను
అందించలేక ఆదుకోలేక
శవాల గుట్టలతో నిండి
శ్మశానాలుగా మారిన ఆసుపత్రులేనని?
యుద్ధం యుద్దోన్మాదులకు ఓ పండుగని...
ప్రజలకు మాత్రం అదొక ప్రత్యక్ష నరకమని...



