Facebook Twitter
యుద్దమంటే...ఎవరికిష్టం...?

యుద్దమంటే ఎవరికిష్టం..?
మారణహోమం సృష్టించే
మతోన్మాదులకే...రక్తదాహం
తీరని రాజులకే రాక్షసులకే...

యుద్దమంటే ఎవరికిష్టం..?
ఎటుచూసినా కలనైనా ఊహించని
అతి భయంకరమైన ధన ప్రాణ నష్టం

యుద్దమంటే...రాకెట్ల దాడులే....
చెవులు చిల్లులుపడే మర ఫిరంగుల మ్రోతలే...యుద్దట్యాంకుల చప్పుళ్ళే...

యుద్దమంటే...దాడులు ప్రతిదాడులే...
అమాయకపు ప్రజల గుండెల్లో గుబులే...
బిక్కుబిక్కుమంటూ బంకర్లలో బ్రతుకులే..

యుద్దమంటే...ఎటుచూసినా
కుమిలిపోయే కుటుంబాలే...
చెల్లాచెదురైన కుటుంబ సభ్యులే...
ఉన్నఫళంగా ఇళ్ళన్నీ ఖాళీచేసి...
ఆర్జించిన ఆస్తులన్నీ వొదిలేసి...
మూటా ముళ్ళె సర్దుకొని...
కదలలేని వృద్ధులతో ఆకలేసి...
పాలకోసం అల్లాడే పసిపిల్లలతో
ప్రాణభయంతో ఉరుకులు పరుగులే...

ఔను ఇరుపక్షాలకు
అపారమైన ధనప్రాణ నష్టం..?
మరి యుద్దమంటే ఎవరికిష్టం..?
నరమేధం కోరుకునే నరరూప రాక్షసులకే...
మారణహోమం సృష్టించే మానవమృగాలకే