యుద్దమంటే...
ఎటుచూసినా కళ్ళముందరే
కాలిబూడిదైన ఖరీదైన ఇళ్ళే
కుప్పకూలిన బహుళ
అంతస్తుల భవనాలే...శవాలే...
విధ్వంసమే...వీధుల్లో శిధిలాలే...
ఆ శిధిలాల క్రింద ఇరుక్కుపోయి
ఆదుకోమని అమాయకుల హాహాకారాలే...
ఆపన్నహస్తాలకోసం నిరీక్షించే అభాగ్యులే...
అరుపులే...కేకలే...ఆకలితో ఆక్రందనలే...
పగిలిన తలలే...రగిలిన గుండెలే...
శాడిస్టులైన శత్రువులకు శాపనార్థాలే...
శిధిలాల క్రింద వినిపించని సింహగర్జనలే...
కాపాడమని పరమాత్మకు కన్నీటి ప్రార్థనలే...
యుద్దమంటే...
ఎటుచూసినా అమాయకపు
ప్రజలరక్తం ఏరులైపారడమే...
గుర్తుపట్టలేని ఛిధ్రమైన శరీర భాగాలే...
వీధులనిండా అనాధ శవాలగుట్టలే...
ఆసుపత్రుల నిండా...రక్తపు మడుగులో
గిలగిల లాడుతూ బ్రతుకు మీద ఆశతో
కొనఊపిరితో కొట్టుమిట్టాడే క్షతగాత్రులే...
బంధువుల ఏడ్పులే...పెడబొబ్బలే...
యుద్దమంటే...
ఒక మారణహోమమే...
యుద్దోన్మాదుల తీరని రక్తదాహమే...
ఆరని ఘర్షణలే...ఆగని హింసాకాండే...
రగిలే పగలు ప్రతీకారాలే...
ప్రజల ప్రాణాలతో చెలగాటమే...
యుద్దమంటే...
ఎటుచూసినా ఆకలితో
అలమటించే అస్థిపంజరాలే...
ఆరని కన్నీటి గాథలే...చేదు జ్ఞాపకాలే...
తరతరాలకు మానని గాయాలే...పీడకలలే
ఇందుకు...నిన్నటి రష్యా...ఉక్రెయిన్
నేటి హమాస్...ఇజ్రాయెల్ భీకరయుద్దాలే
సజీవ సాక్ష్యాలు...అందుకే...వద్దు వద్దు
యుద్ధం వద్దు...శాంతి మంత్రమే ముద్దు



