Facebook Twitter
మణిపూర్"మారణకాండకు బాధ్యులెవరు?

ఎవరు..?ఎవరు..?
ఈ మణిపూర్ దారుణ
మారణకాండకు బాధ్యులెవరు
ఖచ్చితంగా కారకులెవరు..?
ఇంటర్నెట్ బంద్ చేసిందెవరు...?
చేయించిందెవరు...?ఎందుకు..?

మేకలమీదకు తోడేళ్ళను
జింకలమీదకు పులులను
ఉసిగొల్పిందెవరు..?
ఉగ్రవాదులా..?ఉన్మాదులా..?
మనువాదులా..?మతోన్మాదులా..?

కుకీలరక్తం
ఏరులై ప్రవహించడానికి...
కళ్ళముందే కుకీల ఇళ్ళు...
ప్రార్థనా మందిరాలు...
తగలబడి పోవడానికి...
కాలిబూడిదై మసిబొగ్గైపోవడానికి...

గుర్తుపట్టలేని కుకీల
అనాధశవాలు వీధుల్లో
గుట్టలుగుట్టలుగా పడివుండడానికి...
ప్రాణభయంతో కొండల్లోకి కోనల్లోకి
కుకీలు పరుగులు పెట్టడానికి...
కుటుంబాలు చెల్లాచెదురై పోవడానికి...

బిక్కు బిక్కుమంటూ ఇళ్ళల్లో 
బంధీలైన మహిళల్ని బయటకీడ్చి
వివస్త్రలను చేసి వీధుల్లో ఊరేగించడానికి...

రెండు ఆదివాసి గిరిజన
తెగల మధ్య పగలు రగిలి
రాష్ట్రం రావణ కాష్టమై...
కనీవినీ ఎరుగని ఘోరమైన
హింసాత్మక ఘటనలు ఘర్షణలు
మూడు నెలలుగా‌...
ఎదేచ్చగా జరుగుతున్నా...
రాత్రులందు రిపోర్ట్ లు వీడియోలు
రహస్యంగా వస్తున్నా...చూస్తున్నా...
రక్షక భటుల సాక్షిగా...
రక్తం ఏరులై పారుతున్నా...
మానవత్వం మరణిస్తున్నా...
దారుణ మారణహోమం సృష్టిస్తున్నా...

అత్యున్నత పీఠాన్నధిరోహించిన
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాధినేతలైన
రాష్ట్ర ముఖ్యమంత్రి దేశ ప్రధాని
హోం శాఖ మంత్రుల గుండెలు
రాతిగుండెలై పోయాయే...
ఎందుకింతగా మౌనవ్రతం దాల్చడం..?
ఎంతుకింతటి చవితితల్లి ప్రేమ..?
ఎందుకు మణిపూర్ మంటల్ని
మారణహోమాన్ని ఆపలేకున్నారు..?
ఎందుకు..?ఎందుకు..?ఎందుకు..?