Facebook Twitter
ఆశ ఎక్కడో అభివృద్ధి అక్కడ

ఓ రైతు వీరులారా! 

రైతు సోదరులారా!

మకుటం లేని మహారాజులారా!

 

ఎవరో వస్తారని ఏదో చేస్తారని 

ఎదురు చూసి మోసపోకండి 

మీ స్వశక్తినే మీరు నమ్ముకోండి 

ఆశ...

ఆత్మ బలం...

ఆత్మస్థైర్యం... 

ఆత్మగౌరవం...

ఆత్మవిశ్వాసం...అన్న 

ఐదు ఆయుధాలను ధరించండి 

 

అందుకే వద్దువద్దు ఆవేశం వద్దు 

ఆత్మహత్య అన్న ఆలోచనే వద్దు 

ఆశేశ్వాసగా సాగిపొండి ముందుకు 

 

మీరు నిరాశ నిట్టూర్పులకుగురైతే 

మీరు ఆత్మహత్యలకు పాల్పడితే

మీరు కూర్చున్న కొమ్మను 

మీరే నరుక్కున్నట్లు

మీ కంటిని మీరే పొడుచుకున్నట్లు

మీ బంగారు భవిష్యత్తును 

మీరే బంగాళాఖాతంలోకి విసిరినట్లు

 

ఓ అన్నదాతలలారా ! 

ఓ ఆశాజీవులారా‌ !

ఈ ఐదు పదునైన నాగళ్ళతో 

మీ జీవితాలను దున్నుకోండి 

ఆపై పచ్చని పంటలు తప్ప 

ఆకలిమంటలు ఆత్మహత్యలులేని 

ఆనందమయ జీవితాలననుభవించండి 

 

ఎక్కడ మేఘముంటుందో

అక్కడ మెరుపుంటుంది

ఎక్కడ నల్లని మేఘముంటుందో

అక్కడ చల్లని గాలి వుంటుంది

 

ఎక్కడ చిరుగాలి వుంటుందో

అక్కడ చినుకు వుంటుంది

ఎక్కడ చినుకు వుంటుందో

అక్కడ ఆశ వుంటుంది

ఎక్కడ ఆశ వుంటుందో 

అక్కడ అభివృద్ధి వుంటుంది