వెలిగే సూర్యున్నిచూస్తే
చీకటి బయబడుతుందని...
శ్రమించే మనిషిని చూస్తే
ఓటమి భయపడుతుందని...
కెరటం నాకు ఆదర్శమని...
పడినందుకు కాదు
పడినా పైకి లేచినందుకని...
నీ ముందు ఏముంది
నీ వెనుక ఏముంది అన్నదికాదు
నీలో ఏముందన్నది ముఖ్యమంటూ"
విలువైన సందేశాలతో
విజ్ఞానదాయకమైన ప్రసంగాలతో
ప్రపంచ ప్రజలందరిని ప్రభావితం చేసిన
అందరి జీవితాల్లో వెలుగులు నింపిన
విజ్ఞానభాస్కరుడు...మన వివేకానందుడు
నరుడే నారాయణుడని...
నరులంతా సమానమని...
చేపలు పట్టే వారినుండే...
చెప్పులు కుట్టేవారినుండే...
నాగలిపట్టే రైతులనుండి...
నవభారత నిర్మాణం జరగాలని...ఆకాక్షించిన
ఆథ్యాత్మిక గురువు... మన వివేకానందుడు
బలమే జీవమని...
బలహీనతే మరణమని...
ఇనుపకండరాలు ఉక్కునరాలు
వజ్రసంకల్పమున్న ఓ యువకులారా !
లెండి ! నిద్ర మేల్కొండని !
గమ్యం చేరేంతవరకు మీ పరుగు ఆపకండని
మీరు అనంత శక్తిసంపన్నులని...
మీరు పులులని, సింహాల్లా గర్జించాలని...
ఆత్మవిశ్వాసమే మీ ఆయుధమని...ప్రభోదించిన
యువతలో చైతన్య జ్వాలలను...రగిలించిన
జ్ఞానదాత స్పూర్తి ప్రదాత...మన వివేకానందుడు



