ప్రేమపిచ్చిపట్టి తెగనచ్చినాడని
ఓపచ్చి నయవంచకుణ్ణి నమ్మితే...
రెచ్చిపోయి పగలు రేయి
విచ్చలవిడిగా తిరిగితే...
కామంతో కళ్ళుపొరలు కమ్మితే...
కడుపు పండితే, ఖర్మకాలి
పెళ్ళికి ముందే తల్లయితే...
వాడుకున్న వాడు తర్వాత ఎంత
వేడుకున్నా పుట్టిన బిడ్డకు
తాను తండ్రినే కాదంటే...
పరువు పోతుందని
పాపం ఏ పాపం ఎరుగని
ఆ ముసి ముసి నవ్వుల
పసికందును ఏ మురికిగుంటలోనో
ఏ ముళ్లపొదల్లోనో విసిరేసి
చున్నీతో ఫ్యానుకు ఉరివేసుకొని
ప్రాణాలు తీసుకుంటే...
మీమీద గంపెడు ఆశలు పెట్టుకొని
మీరు కలెక్టర్లు కావాలని...
కంప్యూటర్ ఇంజనీర్లు కావాలని...
కన్నవాళ్లు కమ్మని కలలెన్నో కంటూవుంటే...
అన్ని టీవీ ఛానెల్స్ లో
మీరు ప్రేమపరీక్షలో ఫెయిలయ్యారని...
అందుకే ఆత్మహత్య చేసుకున్నారని...
ప్రాణాలు తీసుకున్నారని...
బ్రేకింగ్ న్యూస్ వస్తూవుంటే...
గుట్టుగా బ్రతికే అమ్మానాన్నల
గుండెల్లో ఆశలు ఆరిపోవా ?
అగ్నిపర్వతాలు బద్దలైపోవా ?
అందుకే
ఓ అమాయకపు ఆడపిల్లలారా!
ఇకనైనా ఆలోచించండి...
"ప్రేమ...విద్య" అనే
నాలుగు అక్షరాల మధ్య నలిగిపోకండి
"విద్య కన్న ప్రేమకే ఎక్కువవిలువ"నివ్వకండి
"అనురాగం...అమృతం...విషం"అన్న
నగ్నసత్యాన్ని మరవకండి
"ప్రేమఊబిలో" కూరుకుపోకండి
తొందరపడి "ఏ తప్పు" చేయకండి
"తప్పటడుగులు" వేయకండి
తల్లిదండ్రుల "పరువు" తీయకండి
గుండెల్లో "గునపాలు" గుచ్చకండి
కన్నవారి కళ్లను
"కన్నీటి సముద్రాలుగా" మార్చకండి
మా ఈ మంచి మాటలు
ఖచ్చితంగా వింటారు కదూ!....
పిచ్చి ప్రేమకు దూరంగా వుంటారు కదూ!.....
ఇట్లు ప్రేమతో మీ నాన్న ఆశతో మీ అమ్మ



