ఇప్పుడు
దోచుకోవడానికి
ఇంటికొచ్చిన దొంగ
చేతికిచిక్కినా తిట్టరు
కొట్టరు వానిపై కేసుపెట్టరు
తీసుకున్నంత తీసుకొని
దోచుకున్నంత దోచుకొని
వెంటనే ఇంటినుండి
వెళ్లి పొమ్మంటారు
వాడు తాకిన వస్తువేది
తమకు వొద్దంటారు
డబ్బైనా బంగారమైనా
ఖరీదైన పట్టుచీరలైనా సరే
ఇంట్లోకొస్తూ ఆ దొంగ తెలివిగా
కుక్కకిన్ని బిస్కెట్లు వేసి
కాపలా కుక్కను కాకాపట్టి
నోరు మూయించేసినా
కరవకుండా అరవకుండా ఏదో
మంత్రమేసినా మాయచేసినా
బీరువాల నిండా ఉన్న
బట్టల్ని డబ్బుల కట్టల్ని
మెరిసే బంగారునగల్ని
కోరుకున్నంత, వాడు
మోయ గలిగినంత
మూటకట్టుకొని
ముసిముసి నవ్వులు
నవ్వుతువుంటే ఖుషీఖుషీగా
కులుకుతువుంటే
మూలనున్న తేలొకటికుట్టినా
వాడు కెవ్వుమనికేక పెట్టక
బాధనంతా లోలోన భరించినా
ఏదైనా చిన్న "దగ్గు" దగ్గినా
"తుమ్ము" తుమ్మినా ఇంటిల్లిపాదీ
ఉలిక్కిపడి దిగ్గున మేల్కొంటారు
దొరికిన ఆ దొంగకు
దేహశుద్ధి చేయరు
కోవిడ్ సోకివుండొచ్చని
వాన్నెవరు పట్టుకోరు
ముట్టుకోరు ముందుకురారు
కొట్టరు తిట్టరు తాళ్ళతో కట్టరు
వాడిమీద కేసులు పెట్టరు
వాన్ని వెంటనే ఇంటినుండి
వెళ్ళి పొమ్మని వేడుకుంటారు
ఇల్లుగుల్ల చేసినా ఫర్వాలేదు తమ
ప్రాణాలు దక్కితే చాలనుకుంటారు
దవాఖానాలకెల్తే ప్రాణాలు పోవుడే కాదుగా
ఒళ్ళు ఇల్లు రెండు గుల్లైపోతాయిగా అందుకని...
ఇంతకీ ఎవరు అదృష్టవంతులు కోవిడ్ దొంగనా ?
లేక ఇళ్ళుగుల్లైనా ప్రాణాలు దక్కిన ఇంటివాళ్ళా ?



