దయచేసి దాని పేరు అడక్కండి
ఆ జీవి అంటే
అందరికీ అసహ్యం
కానీ కొన్ని నిరుపేద
కుటుంబాలకది జీవనాధారం
కాకితో కోకిలతో
పోటీపడే దాని అందం
ముక్కులదిరేపోయే
మురికే దానికి మకరందం
అది దొర్లుతుంది
భరించలేని దుర్గంధంలో
పొర్లుతుంది బురదలో సరదాగా
మునిగితేలుతుంది మురికిగుంటల్లో
తనకీ నీచజన్మ నిచ్చినందుకు
ఏనాడు ఎవరినీ
నిందించలేదు నిరాశ చెందలేదు
ఆ దైవాన్ని సైతం
దూషించలేదు దుఖించలేదు
ఛీపో అన్నా అది
చిరునవ్వులు చిందిస్తూ వుంటుంది
ఆహా! ఏమిటి ? ఎంతటి ఆశ్చర్యకరం ?
ఎంతటి అద్భుతం ఆ భగవంతుని సృష్టి ?
"కంపును ఇంపుగా" భావించే తత్త్వాన్ని
కడుపుతిప్పే" దుర్గంధాన్ని భరించే శక్తిని"
నిత్యం మనుషులమధ్యే నివసించే "భాగ్యాన్ని"
"వాసన ఎరుగనిముక్కును" ఆ జీవికి ప్రసాదించిన
ఆ భగవంతుడెంతటి మహిమాస్వరూపుడో కదా !
దాని ముచ్చటే...మురికి ముచ్చట
అందుకే దయచేసి దాని పేరు మాత్రం నన్ను
అడగకండి అదేమిటో మీ అందరికీ తెలుసు.....



