కీర్తి కిరీటం
అన్ని దీపాలు ఆరిపోయినా
అన్ని దారులు మూసుకుపోయినా
కూల్ కూల్ అనుకుంటూ
కొద్దికొద్దిగా నెత్తిన నీళ్ళు చల్లుకోవాలి
కొండంత ఓపికతో ఉండాలి
మన పని అయ్యేంతవరకు
మనకు ఫలితం దక్కేంతవరకు
విత్తనాలు వెదజల్లిన
మరుక్షణమే
మొక్కలు పెరగాలని
కాయలు కాయలని
కడుపులు నిండాలని
ఆశించడం ఎంతటి అవివేకం ?
సముద్రస్నానం చేయాలన్న
ఆశతీరాలన్న ఆగక తప్పదే
ఉరుకులు పరుగులతో
ఉప్పొంగే అలలు అలసి
అలసి ఆవలితీరం చేరేవరకు
అందుకే
నిప్పురవ్వలా ఎగిసే
ఆవేశాన్ని ఆపుకోవాలట
పిచ్చి కోపమొచ్చినా
ఉద్రేకంతో రెచ్చిపోక
చిరునవ్వొకటి చిందించాలట
శాంతి శాంతిః అంటూ శాంతి
మంత్రమొకటి జపించాలట అలా
జపించినవారికి ఏ జబ్బురాదట
వారే ఎక్కువ కాలం బ్రతుకుతారట
కీర్తికిరీటం దక్కేది శాంతమూర్తులకేనట



