Facebook Twitter
ఎవరు గొప్ప..? నరుడా..? నారాయణుడా..?

పార్టు...1
ఓ నా ప్రియమిత్రులారా..!
ఈ ప్రకృతికి...
ఈ పంచభూతాలకు...
సృష్టికర్త ఆ పరమాత్మే...
ఈ నేలపై నడయాడే
ఈ నరుడు కావచ్చు
ఒకనాడు వానరుడు
కానీ ఆ నరుడే నేడు
వర్ణ చిత్రాలకు వరుడు...
అంటే కాదనగలరా..?
వారెవరైనా..? ఈ అవనిపైన...

ఆ పంచభూతాల
ఫలాలననుభవిస్తూ
ఈ ప్రకృతిలో ఓ
పక్షిలా పరిభ్రమిస్తూ
వాటి అందాలకు ముగ్ధుడై

ఆ ప్రకృతి దృశ్యాలను
తిలకించి పులకించిపోతూ
పట్టరాని ఆనందంతో
పరవశించిపోతూ...
ఆకలి...దాహం...
కాలం...మరిచి...

తన కుంచెతో
అందమైన...
అపురూపమైన...
అతి సుందరమైన...
ఊహలకందని వర్ణాలతో
అందాల అమృత
బిందువుల్నందిస్తూ...
సకల మానవాళిని
సంతోష తీరాలకు చేరుస్తూ...

పార్టు...2

సృష్టికి ప్రతిసృష్టి
చేయు విశ్వామిత్రునిలా...
అమరశిల్పి జక్కన్నలా...
రంగుల హరివిల్లుల్ని
అవనికి రప్పించే ఆ రవివర్మలా...

పచ్చని ప్రకృతి శోభను
చూసి తరించడానికి...
ఈ రెండు కళ్ళూ చాలవని...
కోటి కళ్ళైనా తమకు కావాలని...
ఆ పరమాత్మను ప్రార్థించేలా...

అంతులేని
వింత అందాలను
చీకటిలో చిరుదివ్వెల్లా
చిత్రీకరించే చిత్రకారుడా..?
ఎవరు గొప్ప..?
నరుడా..? నారాయణుడా...?
ఎవరికి వారే గొప్ప..!

లేదు లేదు అలా అనరాదు...
తన కుంచెతో సప్తవర్ణాలతో
ప్రకృతి అందాలకు జీవంపోసే
ఆ చిత్రాకారునికి...
తల్లిగర్భంలో ప్రాణం పోసే
ఆ పరమాత్మయే కదా గొప్ప...
అంటే కాదనగలరా..?
ఎవరైనా...ఈ అవనిపైన...