ఓ మనిషీ..!
ఈ విశాల విశ్వంలో
ఈ సూర్యుని క్రింద
ఈ భూమిపైన
నమ్మశక్యం కాని
ఎన్ని వింతలో..?
ఎన్ని విచిత్రాలో...?
ఎన్ని ధర్మ సందేహాలో..?
నీకు కంటినిచ్చిందెవరు..?
ఆ దైవమే..! ఐతే
ఆ కంటికి చూపును...
ఆ కంటికి వెలుగును...
ఆ కంటికి కనురెప్పలను...
ఆ కంటికి నిద్రను...
ఆ కంట్లో కన్నీరు నిచ్చిందెవరు..?
ఆ దైవమే..! ఐతే
ఆ కన్నీటిని తుడిచే వ్రేలును...
ఆ మనిషిని ఓదార్చే ఒడిని...
ఆపదలో ఆదుకునే హస్తాన్ని...
ఆత్మీయతను పంచే
సకాలంలో స్పందించే...
హృదయాన్నిచ్చిందెవరు..?
ఆ దైవమే..! ఐతే
గడ్డితినని పులిని
సృష్టించిందెవరు..?
ఆపులికి ఆహారంగా
జింకల్ని పుట్టించిందెవరు..?
ఆ దైవమే..? ఐతే
ఆ ఆకాశంలో ఆ నీలి నీలి
మేఘాలను సృష్టించిందెవరు..?
ఆ మేఘాలను
నీటిబింధువుల్తో నింపిందెవరు..?
ఆ దైవమే..! ఐతే
కనిపించని ఆ గాలిని
సృష్టించిందెవరు..?
ఆ గాలి ఎటునుంచి
ఎటు వైపుకు ఎందుకు
పయనిస్తుందో ఎవరికి ఎరుక..?
ఆ దైవానికే..! ఐతే
ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగే
ఇద్దరు యువతీయువకులను
భార్యాభర్తలుగా గుర్తించి వారిని
మూడు ముళ్లబంధంతో
ముడివేసేదెవరు..? ఏకాంతంగా
ఆ ఇద్దరి నీ ఓ గదిలో
దాచేదెవరు..? ఎందుకు..?
ఒక తల్లిగర్భంలో
పిండాన్ని సృష్టించేదెవరు..?
పుట్టబోయే ఆ బిడ్డ
ఆడో మగో నిర్ణయించేదెవరు..?
తల్లి రక్తాన్ని పాలగా మార్చేదెవరు..?
ఆ దైవమే..! ఐతే...ఐతే...
ఈ సృష్టికిమూలం ఆ దైవమే..! ఐతే
ఆ దైవాన్ని ప్రత్యక్షంగా
కళ్లతో దర్శించిందెవరు..?
ముఖాముఖిగా మాట్లాడిందెవరు..?
అఖండ తేజోమయుడైన...
అత్యంత శక్తి స్వరూపుడైన...
సూర్యున్ని తమ నేత్రాలతో
దర్శించుకోలేని ఈ నరులు...
ఆ సూర్యున్నే సృష్టించిన
ఆ దైవాన్నెలా దర్శించుకోగలరు..?
అది అసాధ్యమే..! అసంభవమే..!
అత్యాశే..! అవివేకమే..! అజ్ఞానమే..!
అది ఓ చిదంబర రహస్యమే...అదెంతకూ
అర్థంకాని ఓ ప్రకృతిధర్మమే సృష్టిమర్మమే.



