"అనుకున్నామని
జరగవు అన్నీ...
అనుకోలేదని ఆగవు కొన్ని...
జరిగే వన్నీ మంచికని...
అనుకోవడమే మనిషి పని"...
అని ఓ తెలుగు కవి
జీవితసందేశాన్ని అందించినట్టు...
విధి వ్రాసిన ఆ
తలరాతను చెరిపేదెవరు..?
కనిపించని...ఆ తలరాతను
కనిపించే...ఈ చేతిగీతను
చదువ ఎవరితరం..?
జరిగేవన్ని జరగక మానవు...
కాచే ఎండ కాయక మానదు...
కురిసే వాన కురియక మానదు...
పొడిచే పొద్దును...
మెరిసే మెరుపును...
ఉరిమే ఉరుమును...
విరిచే కుసుమాన్ని ఆపేదెవరు..?
జన్మజన్మల కర్మఫలం
మనం అనుభవించక తప్పదు...
తమకిష్టమైన బిడ్డనే కనాలని...
కొత్తజంట ఎంతగా కోరుకున్నా...
గుళ్ళు గోపురాలెన్ని దర్శించినా...
ఎందరు దేవుళ్ళకు మ్రొక్కినా...
ఎన్ని కలలుగన్నా ఏమి లాభం ?
ఎంతగా తపించినా నవమాసాలు
పూజలు వ్రతాలెన్ని చేసినా కడకు
ఆ దైవం ఇచ్చిన బిడ్డనే పుచ్చుకోక
తప్పదే...ఇష్టమున్నాలేకున్నా...
ఔను మనిషికి అర్థం కానివి రెండే...
ఈ ప్రకృతి ధర్మం...ఆ సృష్టిమర్మం...



