Facebook Twitter
భారత మాతకు జేజేలు...!బంగరు భూమికి జేజేలు...!

"భారత మాతకు జేజేలు
బంగరు భూమికి జేజేలు
ఆసేతు హిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు" అంటూ
ఆ కన్నతల్లి భరతమాతను
పుట్టిన రత్నగర్భను
నిత్యం స్మరించుకోవాలి...

నేడు మనం నిర్భయంగా తిరగడానికి
నాడు భగత్ సింగ్ అల్లూరి ఝాన్సీ లక్ష్మీబాయి వంటి వీరులెందరూ
తమ ప్రాణాలను బలి పెట్టినారు తృణప్రాయంగా తెగించినారు

గాంధీ నెహ్రూ తిలక్ పటేల్ వంటి
స్వాతంత్ర సమరయోధులు
జీవితాంతం దేశ సంక్షేమం కోసం
ప్రజాశ్రేయస్సే ధ్యేయంగా తపించారు
స్వాతంత్రం కోసం...
పరాయిపాలన
అంతమొందించడం కోసం...
తెల్లదొరల బానిసత్వం నుండి
ఈ భారతజాతిని
విముక్తి చేయడం కోసం...
జైలుజీవితం గడిపారు...
సర్వం త్యాగం చేశారు...

అందుకే మనం
ఆ దేశభక్తులను...
ఆ వీరజవాన్లను...
ఆ విప్లవవీరులను...
ఆ త్యాగమూర్తులను...
ఆ స్వాతంత్ర సమరయోధులను...
నిత్యం స్మరించుకోవాలి...

మన జాతీయపతాకానికి
వందనం చేస్తూ...
"వందేమాతర"మంటూ
దిక్కులు పెక్కటిల్లేలా నినదించాలి...
జనమంతా "జనగణమన
గీతాన్ని" ఆలపించాలి....
"జై జవాన్ జై కిసాన్"
"ఇంక్విలాబ్ జిందాబాద్" అంటూ ముక్తకంఠంతో విశ్వమంతా వినిపించాలి...

ప్రతి భారతీయుడు
విజయగర్వంతో ప్రశాంతంగా... సుఖసంతోషాలతో జీవించాలి... 
తలఎత్తుకు ధైర్యంగా తిరగాలి...
నీతినిజాయితీతో నిప్పులా బ్రతకాలి.. .

నాడు తెల్లదొరల్ని తరిమినా
నయవంచకులైన
ఈ నల్లదొరల్ని నమ్మరాదు...కారణం
నా ఈ వేదభూమిపై ఇంకా ఎన్నో
వేదనలు వివక్షతలు విహరిస్తున్నాయి
అసమానతలు రాజ్యమేలుతున్నాయి

అందుకే ప్రతి భారతీయుడు
త్రివర్ణ పతాకం చేతబట్టి...
తల్లి భరతమాతకు ప్రణమిల్లి...
త్రికరణశుద్ధిగా ప్రమాణం చేయాలి
కామాంధులను కాల్చివేస్తామని...
కులవృక్షాలను కూల్చివేస్తామని...
మతోన్మాదులనుమట్టు పెడతామని...
సమసమాజానికి పునాదిరాళ్ళు ఔతామని.