ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం...
పూసపాటి గజపతుల ఇలవేల్పు...
పెద్ద విజయరామరాజు ముద్దుల చెల్లి...
బంగారుతల్లి చల్లని చూపుల మన పైడితల్లి
1758లో విజయనగరంలో మూడు
లాంతర్ల కూడలిలో నిర్మించిన అమ్మవారి దేవాలయంలో గత 265 సంవత్సరాలుగా
జరుగే మహాజాతరే మన పైడితల్లి జాతర...
లోకపావని కలియుగంలో ప్రత్యక్ష దైవంగా అలరారే పైడితల్లి మూల విరాట్టును
విజయనగరం పెద్దచెరువు నుండి పైకి తీసి
గర్భగుడిలో ప్రతిష్టించిన తొలిపూజారి...
పతివాడ అప్పలస్వామినాయుడు...
ఏటేటా నిర్వహించే ఉత్సవాలలో
"సిరిమాను ఉత్సవం" సుప్రసిద్ధం
"సిరిమాను" అనగా చింతలుతీర్చే
చింతచెట్టు మ్రాను. పైడి తల్లికి
ప్రతిరూపంగా ఆలయ పూజారి
సిరిమాను పైకెక్కి భక్తులను దీవిస్తాడు
చూడముచ్చటగా అత్యంత మనోహరంగా శోభాయమానంగా బంగారు వర్ణంతో అలంకరించిన 33 మూరల విజయనగర పైడితల్లి "సిరిమాను రథం" ఊరేగింపు మహోత్సవమే పైడితల్లి అమ్మవారి జాతరలో...అత్యంత ప్రధానమైన ఆకర్షణ...
భక్తులకు కనువిందైన...పసందైన పండుగ...
సిరిమాను ఇరుసుపై ప్రధాన పూజారి
ఆసనుడై చేతిలో విసనకర్రతో భక్తులను
దీవించడం భక్తులు సిరిమానుపై అరటిపళ్లు
విసరడం ఆటపాటలతో కోలాటాలతో నృత్యాలతో ఆ సంబరం శోభాయమానం
సిరిమాను ముందు సాగే జాతరలో
తరతరాల సేవానిరతికి భక్తివిశ్వాసాలకు మారుపేరైన అంజలి రథం...బెస్తవారి వల... పాలధార...తెల్ల ఏనుగు...అంజలి రథం... ముందు నడుస్తుండగా చిత్రవిచిత్రంగా వేషదారులు పరవళ్ళుత్రొక్కుతూ...భక్తి పారవశ్యంతో పరిగెత్తేవేళ...లక్షలాదిమంది భక్తులు అమ్మవారి వైభవాన్ని మహిమను తనివితీరా...కనులారా...తిలకించి... తన్మయత్వంతో పులకించిపోయే భక్తుల
కోర్కెలు తీర్చి కోటి వరాలు ప్రసాదించే
కనకదుర్గ జాతరే మన పైడితల్లి జాతర...
నాడు గ్రామదేవతగా వెలిసిన పైడితల్లి కీర్తి
నేడు ఖండ ఖండాంతరాలు దాటిపోయింది
విశ్వవ్యాప్తమైపోయింది...అట్టి మహాతల్లిని
దర్శించిన...స్మరించిన...వారి జన్మధన్యమే.



