దేశభక్తుల దేహాలలో
మానని గాయాలెన్నో ఎన్నెన్నో...
బిక్షగాళ్లుగా వచ్చిన బ్రిటిష్ దొరలు
రక్తం త్రాగే రాక్షసులైనారని భరతమాత కుమిలిపోయిన క్రుంగిపోయిన రాత్రులెన్నో..
నాటి భారత మాత దాస్య
శృంఖలాలను త్రెంచేందుకు...
భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామంలో
మ్రోగించిన యుద్ద భేరీలెన్నో...
పూరించిన విప్లవ శంఖారావాలెన్నో ...
చేసిన ఉద్యమాలెన్నో భీకరపోరాటాలెన్నో...
త్రివర్ణ పతాకాన్ని...చేబూని
ఉద్యమకారులు...ఉరుములై
ఉరిమి మెరుపులై మెరిసి పులులై
ఉరికిన రక్తసిక్తపు రహదారులెన్నో...
వందేమాతరం...వందేమాతరమంటూ
నిజమైనదేశభక్తులు నిరసనలనిప్పులు
కురిపించిన సభలు...సమావేశాలెన్నో....
విప్లవ వీరుల...
ఆవేదనలు ఆక్రందనలు...
కౌగిలించుకున్న కష్టాలెన్నో...
కూలిపోయిన కుటుంబాలెన్నో...
అనుభవించిన చిత్రహింసలెన్నో...
రగిలి పగిలిపోయిన గుండెలెన్నో...
రాలిపోయిన...లేతకుసుమాలెన్నో...
కారుచీకటిలో కార్చిన కన్నీటిధారలెన్నో...
ఆ త్యాగమూర్తులు...
చేసిన నిస్వార్ధమైన త్యాగాలెన్నో...
ఒరిగిపోయిన పర్వత శిఖరాలెన్నో...
జైళ్ళలో మ్రగ్గిన...జాతినేతలెందరో...
క్విట్ ఇండియా...క్విట్ ఇండియా అంటూ
దిక్కులు పిక్కటిల్లేలా నినదించి నినదించి
ఆగిపోయిన మూగపోయిన గొంతులెన్నో...
ఆ చీకటిరోజుల్లో తెల్లారగానే తెల్లదొరల క్రూరకరవాలాలకు తెగిపడిన శిరస్సులెన్నో..
తిరిగి రాని లోకాలకు
తరలివెళ్లిన త్యాగధనులెందరో...
నింగినిచేరి ధృవతారలై వెలిగిపోతున్న
స్వాతంత్ర్య సమరయోధులెందరో ఎందరో
అందరికీ వందనాలు...పాదాభివందనాలు
నేడే త్రివర్ణ పతాకాన్ని ఎగురవేద్దాం!
త్రికరణ శుద్ధిగా ప్రమాణం చేద్దాం!
జయహో...జయహో...
జేజేలు మీకు ఓ జాతినేతలారా !
"మీ స్మరణే మాకు ప్రేరణ" అంటూ
వారి అడుగుల్లో అడుగులు వేద్దాం!వారి
ఆశయాలకు జీవితాలను అంకితం చేద్దాం!



