మడిలో...ఉంటారు
మండుటెండల్లో
చెమటలు కార్చి కార్చి
మట్టిని మెతుకుగా మార్చి మార్చి
ఆకలిమంటలు తీర్చేటి అన్నదాతలు
బడిలో...ఉంటారు
నేటి బాలలను రేపటి డాక్టర్లుగా...
లాయర్లుగా...లక్షాధికారులుగా...
కలెక్టర్లుగా... సినీయాక్టర్లుగా
కంప్యూటర్ ఇంజనీర్లుగా...
సైనికులుగా... సైంటిస్టులుగా...
భావిభారత పౌరులుగా తీర్చిదిద్ది
బంగారు భవిష్యత్తును ప్రసాదించే
గురువులనే...జ్ఞానసూర్యులు
గుడి...ముందు ఉంటారు
గుంపులు గుంపులుగా
కళ్ళు కాళ్ళు లేని అనాధలు
ఏ ఆధారం లేని
ఎగరలేని గాలిపటాలు
రెక్కలు విరిగిన పక్షులు
ఆకలికి అలమటించే బిక్షగాళ్ళు
గుడికెళ్ళే...వచ్చే...
భక్తులను ప్రాధేయపడతారు
ఇంత "చిల్లర" వేయమని...
కానీ గర్భగుడిలో కొలువైవున్న
ఆ "భగవంతున్ని" వేడుకోరు
తమ "బ్రతుకుల్ని" బాగుచేయమని...
ఇదేమి వింతో ఎంతకూ అర్థం కాదు...
కానీ బిక్షగాళ్ళు బిల్ గేట్స్ గా మారేది
దశ తిరిగితేనే ఏదైనా లాటరి తగిలితేనే



