నీ ఆలోచనలు నీ తలంపులు
నీ భావనలు నీ ఊహలు పుట్టేది
నీ మేధస్సు నుండి నీ మనసు నుండి
నీ బుద్ధి నుండి నీ హృదయం నుండి
నీ ఊపిరినుండి నీ ఆత్మనుండే కదా !
నీ నాలుకకు...
మాటలు నేర్పేదెవరు ?
నిన్ను మాటలు రాని
మూగవాడిగా మార్చేదెవరు ?
నీ పాదాలకు...
నడక నేర్పేదెవరు ?
ఆ నడకను ఆపేదెవరు ?
నీ కనులకు...
చూపు నిచ్చేదెవరు ?
ఆ చూపును నీ కనురెప్పలను
శాశ్వతంగా మూసివేసేదెవరు ?
నీకు ఆశలు రేపేదెవరు?
నీకు ఆకలి పుట్టించేదెవరు ?
ఆ ఆకలిమంటలను ఆర్పేదెవరు ?
నిన్ను రాత్రివేళ
నిద్రపుచ్చేదెవరు ?
తిరిగి సూర్యోదయం వేళ
నిద్రనుండి నిన్ను మేల్కొల్పేదెవరు ?
నీ ప్రయాణంలో ఆకస్మికంగా
ఘోర ప్రమాదాలను కలిగించేదెవరు ?
ఆ ప్రమాదాల నుండి నిన్ను రక్షించేదెవరు ?
నీకు ఘోరమైన రోగాలను
వ్యాధులను పుట్టించేదెవరు ?వాటి
నుండి నీకు స్వస్థత కలిగించేదెవరు ?
నిన్ను ఆకాశానికి ఎత్తేదెవరు ?
నిన్ను అగాధములో పాతాళంలో
ఊపిరాడని ఊబిలో పడద్రోసేదెవరు ?
నీకు అంతులేని ఆనందాన్ని
సంతోషాన్ని కలిగించేదెవరు ?
నీ కళ్ళనుండి జలజల కురిసే
ఆ కన్నీటిధారలకు కారణమెవరు ?
వాటిని తుడిచే అదృశ్యహస్తములెవరివి ?
నీవు చేసే ప్రతికార్యానికి
ఊహించని ప్రతిఫలాన్ని అందించేదెవరు ?
ఈ భూమిపైన
నీ జనన మరణాలను
నీ సుఖ...దుఃఖమయ
జీవితాన్ని శాసించేదెవరు ?
నీవు సర్వం శాశ్వతమని
తలంచిన మరుక్షణమే కాదు కాదు
నీ జీవితం క్షణికమేనని...అదొక
నీటిబుడిగేనని నీకు గుర్తు చేసేదెవరు ?
నీ నీడలో నీడై
నీ రక్తంలో రక్తమై
నీ ఊపిరిలో ఊపిరి
నిన్ను నిత్యం నడిపించేదెవరు ?
ఎవరు ఎవరు ఇంకెవరు ?
నీకు అర్థం కాని ఆ అంతర్యామి
నీకు దర్శనం ఇవ్వని ఆ దైవమే కదా !
నీ మృత్యువే మీ శత్రువై
నిన్ను వేధిస్తుంటే బాధిస్తుంటే
భయపడకు...నేనున్నానని...
ఆపద్బాంధవుడిలా ఆపదలో
ఆదుకునేదెవరు? ఆ భగవంతుడే కదా !



